
చాలామంది తాము సంపాదించిన డబ్బును సేవింగ్స్ అకౌంట్లలోనో లేదా ఇంట్లో బీరువాలోనో దాచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల మీ డబ్బు విలువ పెరగదు సరే కదా.. ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ తగ్గుతుంది. అందుకే తెలివైన వారు తమ డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టి, దానిని రెట్టింపు చేసుకుంటారు. అయితే పెట్టిన పెట్టుబడి సురక్షితమేనా? మార్కెట్ రిస్క్ ఉంటుందా? అనే భయంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసం పోస్టాఫీస్ అందిస్తున్న ఒక అద్భుతమైన పథకమే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. పోస్టాఫీసు ద్వారా లభించే ఈ పథకంలో పైసా రిస్క్ ఉండదు, పైగా లాభాలు మాత్రం అదిరిపోతాయి.
ఏమిటీ NSC పథకం?
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పొదుపు పత్రం. ఇది పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంటుంది. దీనిపై ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం వల్ల మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.
వడ్డీ రేటు – మెచ్యూరిటీ:
ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 7.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. అంటే ఐదేళ్ల పాటు మీరు పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీ లెక్కన లాభం వస్తుంది.
రూ. 11 లక్షల లాభం ఎలా వస్తుంది?
ఈ పథకంలో పెట్టుబడికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. ఉదాహరణకు మీరు ఈ పథకంలో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుందాం. 7.7 శాతం వడ్డీ రేటు ప్రకారం.. 5 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి రూ.36,47,638 అవుతుంది. అంటే కేవలం ఐదేళ్లలో ఎటువంటి శారీరక శ్రమ లేకుండా మీరు రూ.11,47,638 లాభం పొందవచ్చు.
NSC పథకం ప్రత్యేకతలు:
- ప్రభుత్వ పథకం కాబట్టి మీ అసలుకు, వడ్డీకి పూర్తి భరోసా ఉంటుంది.
- కనీసం రూ.1000 నుండి పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
- సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.
- ఈ సర్టిఫికేట్లను బ్యాంకులో హామీగా ఉంచి రుణాలు కూడా పొందవచ్చు.
రిస్క్ లేకుండా, బ్యాంకు ఎఫ్డీల కంటే మెరుగైన రాబడి కావాలనుకునే వారికి NSC ఒక బెస్ట్ ఆప్షన్. మీ భవిష్యత్తు అవసరాల కోసం లేదా పిల్లల చదువుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు కావాలనుకుంటే ఇప్పుడే దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు.