గుంటూరు జిల్లా పెదకాకాని దర్గా వద్దకు పెద్ద సంఖ్యలో సాయంత్రం సమయంలో పోలీసులు వచ్చారు. వచ్చిన వెంటనే దర్గా వద్ద ఉన్న ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరూ పురుషులు కాగా.. మరో ముగ్గురు మహిళలు. శ్రీకాళహస్తి నుండి వచ్చిన పోలీసులు వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నార్త్ ఇండియాకు చెందిన వీరంతా నేరాలుకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
శ్రీకాళహస్తి ప్రాంతంలో గత కొంతకాలంగా పాత బంగారం కొంటామని కొంతమంది నార్త్ ఇండియాకు చెందిన మహిళలు, పురుషులు తిరుగుతున్నారు. ఇంటి వద్దకు వెళ్లి ఎక్కువ ధర చెల్లిస్తామంటూ ట్రాప్‌లోకి దించుతున్నారు. దీంతో పాత బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న అమాయకులు వీరి మాటలు నమ్ముతున్నారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన తర్వాత వీరికి డబ్బులు కట్టల రూపంలో ఇస్తున్నారు. కట్టల్లో నిజమైన నోట్ల కొన్ని పెట్టి మధ్యలో తెల్ల పేపర్లతో కట్టలు కడుతున్నారు. ఈ కట్టలను చుట్టూరా ప్లాస్టిక్‌తో కప్పుతున్నారు. దీంతో కొత్త ప్యాకింగ్ కట్టలుగా భావించిన స్థానికులు వాటిని తీసుకుంటున్నారు. పాత బంగారు ఆభరణాలు తీసుకున్న ముఠా అక్కడ నుండి చెక్కేస్తుంది. తమకు ఇచ్చిన నోట్ల కట్టలతో మోసం చేసిన విషయాన్ని స్థానికులు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. కొంతమంది బాధితులు పోలీసులు సమాచారాన్ని చేరవేశారు. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే ఈ ముఠా సభ్యులు మోసం చేసిన తర్వాత అక్కడ నుండి సుదూరంగా పారిపోతున్నారు. లాడ్జిల్లోనూ, ఇళ్లలోనూ ఉండకుండా ప్రార్థనా మందిరాల్లో భక్తుల మాదిరిగా తలదాచుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకాళహస్తి పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. పెదకాకానిలోని బాజీ బాబా దర్గాలో ఉంటున్న నార్త్ ఇండియా ముఠాను గుర్తించి స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిని అక్కడ నుండి చిత్తూరుకు తరలించారు. ఐదుగురుతో పాటు మరికొంతమంది ఉన్నారని.. వారు పోలీసులను గమనించి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.