పిల్లలు తప్పు చేసిన వెంటనే వారిని శిక్షించడం ద్వారా ప్రవర్తన మార్చుకోవచ్చని చాలా మంది తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ దేహశిక్ష వల్ల కలిగే మానసిక దుష్ఫలితాలు చాలా తక్కువగా అంచనా వేయబడతాయి. ఒక్క నిమిషంలో తీసుకున్న కఠిన నిర్ణయం, పిల్లల మనసులో లోతైన గాయంలా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
కొట్టడం పరిష్కారం కాదు
చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను నియంత్రించడానికి కొట్టడాన్ని ఒక సాధనంగా భావిస్తారు. అయితే ఇది శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగా కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శిక్ష కంటే మరింత ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయని మరిచిపోతారు.
భయంతో తలొగ్గుతారు.. అర్థం చేసుకోరు
పిల్లలు కొట్టిన తర్వాత మాట్లాడకుండా ఉండవచ్చు. కానీ ఇది వారు తప్పును అర్థం చేసుకుని మారతారన్న అర్థం కాదు. భయంతో నిశ్శబ్దంగా ఉంటారు. కానీ నమ్మకం, అనుబంధం తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఇది వారు తల్లిదండ్రుల నుంచి దూరమవడానికి దారి తీస్తుంది.
మానసిక ఒత్తిడి
తరచుగా శిక్షలు ఎదుర్కొంటున్న పిల్లల్లో మనస్తత్వ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. నమ్మక లోపం, ఒంటరితనం, భావోద్వేగ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ ప్రభావాలు పిల్లల ఎదుగుదలకు ముప్పుగా మారుతాయి.
తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం
దేహశిక్ష వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భయం పుడుతుంది. ప్రేమతో, ఓర్పుతో వ్యవహరించడమే ఆరోగ్యకరమైన బంధానికి బలం ఇస్తుంది. భయంతో కాకుండా నమ్మకంతో పెరిగే బంధం పిల్లలకు భద్రతను కలిగిస్తుంది.
మార్గం మార్చాల్సిందే..
పిల్లల ప్రవర్తనను మార్చాలంటే ప్రేమతో సరైన దిశలో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఒక పని తప్పో ఒప్పో అన్న విషయాన్ని వారు అర్థం చేసుకునేలా ఓపికతో వివరించడం అవసరం. శిక్ష కంటే శాంతమైన ఉపదేశం ఎంతో మంచిది.
శిక్షలు తాత్కాలిక పరిష్కారంగా కనిపించవచ్చు. కానీ అవి శాశ్వత మార్పుకు దారి తీసే మార్గం కావు. ప్రేమ, సహనం, అర్థవంతమైన సంభాషణతో పిల్లలను తీర్చిదిద్దే తల్లిదండ్రులు.. వారిలో నమ్మకాన్ని, బాధ్యతను పెంచుతారు. దేహశిక్ష కాకుండా మెరుగైన మార్గాలు ఎంచుకోవడం ఉత్తమం.