ఒకప్పుడు ఇండియన్ ఐడల్ లాంటి సింగింగ్ ట్యాలెంట్ హంట్ షో లు ఎక్కువగా హిందీలోనే కనిపించేవి. అయితే ఇదే షోను తెలుగులోనూ పరిచయం చేసింది ఆహా ఓటీటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రియులు, సంగీత ప్రియులు మెచ్చిన ఈ సింగింగ్ రియాల్టీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం యూఎస్ లో ఆడిషన్స్ కూడా నిర్వహించింది. అలాగే ఆన్ లైన్ లోనూ ఆడిషన్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ గ్రౌండ్ ఆడిషన్స్ ను కూడా నిర్వహిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది యంగ్ సింగర్స్ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాటలు పాడుతూ గాయనీ గాయకులుగా ఎదుగుతున్నారు. ఇందుకు మరో ఉదాహరణే.. నజీర్, భరత్ రాజ్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వీరి గానానికి షో జడ్జి, సంగీత దర్శకుడు ఫిదా అయిపోయారు. తన సినిమాల్లో పాటలు పాడే అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు తమన్. అందులో భాగంగానే తాజాగా విడుదలైన ఓజీ ఫైర్ స్ట్రామ్ సాంగ్ లో నజీర్, భరత్ రాజ్ లకు అవకాశం కల్పించారు.