తాజాగా ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఒబేసిటీ’లో ప్రచురితమైన ఒక వైట్‌పేపర్ మన దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై సంచలన నిజాలను వెల్లడించింది. దీనిని కేవలం వ్యక్తిగత సమస్యగా వదిలేయకుండా, ప్రభుత్వాలు పాలసీ స్థాయిలో మార్పులు తీసుకురావాలని నిపుణులు కోరుతున్నారు.
స్థూలకాయం అనేది అనేక అంటువ్యాధులు కాని వ్యాధులకు (NCDs) మూలకారణం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అధిక బరువే. కేవలం ఇవే కాకుండా, వివిధ రకాల క్యాన్సర్లు సోకడానికి కూడా స్థూలకాయమే కారణమని ఈ నివేదిక స్పష్టం చేసింది. కొలొరెక్టల్ (పేగు), ఎండోమెట్రియల్, పిత్తాశయం, కాలేయం, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్ మరియు మెనోపాజ్ తర్వాత వచ్చే రొమ్ము క్యాన్సర్ వంటివి స్థూలకాయం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లోపం కాదు, జబ్బు..
చెన్నైలోని డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ చైర్మన్ డాక్టర్ వి.మోహన్ ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. “ప్రస్తుతం స్థూలకాయాన్ని కేవలం ఒక వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. ఎవరో జంక్ ఫుడ్ తిన్నారు కాబట్టే లావు అయ్యారు అని అనుకుంటారు. కానీ అది అంత సులభమైన విషయం కాదు. కేవలం ఆహారం కొంచెం తగ్గించడం వల్ల మాత్రమే స్థూలకాయాన్ని నియంత్రించలేం. ప్రభుత్వం దీనిని ఒక దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
వివక్షకు చెక్..
స్థూలకాయాన్ని ఒక వ్యాధిగా గుర్తించడం వల్ల సమాజంలో లావుగా ఉన్న వారిపై ఉండే వివక్ష తొలగిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎప్పుడైతే దీనిని ఒక మెడికల్ కండిషన్‌గా చూస్తామో, అప్పుడు ప్రజలు కూడా దీనిపై అవగాహన పెంచుకుంటారు మరియు సరైన చికిత్స తీసుకోవడానికి ముందుకు వస్తారు. ప్రభుత్వం వెంటనే ఆరోగ్య విధానాల్లో మార్పులు చేయడం వల్ల మొత్తం జనాభా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా తగ్గుతాయి. భారతదేశంలో స్థూలకాయం అనే మహమ్మారిని ఎదుర్కోవాలంటే కేవలం అవగాహన సరిపోదు.
రూపాంతర మరియు సమగ్రమైన పాలసీ మార్పులు అవసరం. ప్రభుత్వంతో పాటు సాధారణ ప్రజలలో కూడా ఈ సమస్య తీవ్రతపై అవగాహన పెరగాలి. ప్రజల జీవనశైలి మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య పథకాలను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థూలకాయం అనేది రేపటి తరాన్ని వేధించే అతిపెద్ద సమస్య. దీనిని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో దేశం భారీ ఆరోగ్య భారాన్ని మోయాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్ నియంత్రణ, వ్యాయామం పట్ల ప్రోత్సాహం, పాలసీ స్థాయిలో మార్పులు మాత్రమే ఈ ముప్పు నుంచి మనల్ని కాపాడుతాయి.