Narayan Jagadeesan : వార్మప్ మ్యాచులోనే సెంచరీ కొడితే..వరల్డ్ కప్ లో ప్లేస్ ఇస్తే డబుల్ సెంచరీ చేస్తాడేమో

Narayan Jagadeesan : వార్మప్ మ్యాచులోనే సెంచరీ కొడితే..వరల్డ్ కప్ లో ప్లేస్ ఇస్తే డబుల్ సెంచరీ చేస్తాడేమో


Narayan Jagadeesan : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే భారత కుర్రాళ్లు మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించారు. అమెరికాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇండియా-ఎ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సెంచరీ బాదాడు. కెప్టెన్ ఆయుష్ బదోని, తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరును సాధించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జగదీశన్, అమెరికా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 49 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. అతని మొత్తం ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. 54 బంతుల్లో 104 పరుగులు చేసిన జగదీశన్, టీ20 ప్రపంచకప్ మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయినా, భవిష్యత్తులో తన స్థానం సుస్థిరమని సెలెక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు.

సర్జరీ కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన తెలుగు తేజం తిలక్ వర్మ, ఈ మ్యాచ్‌తో మైదానంలోకి అడుగుపెట్టాడు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన తిలక్, ఏమాత్రం తడబడకుండా ఆడాడు. కేవలం 24 బంతుల్లో 38 పరుగులు చేసి అలరించాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తిలక్ బ్యాటింగ్ చూస్తుంటే అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని అర్థమవుతోంది. దీంతో ప్రపంచకప్ మెయిన్ టోర్నీలో అతను టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం ఖాయమైంది.

జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన బదోని, అమెరికా బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. 4 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 26 బంతుల్లోనే 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా 13 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. వీరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల వల్ల ఇండియా-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 238 పరుగుల పర్వత సమానమైన స్కోరును బోర్డుపై ఉంచింది.

టీమిండియా బ్యాటర్ల దాడిని తట్టుకోలేక అమెరికా ఏకంగా 10 మంది బౌలర్లను రంగంలోకి దించింది. టీమిండియా మూలాలన్న సౌరభ్ నేత్రవల్కర్ మాత్రం 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఫర్వాలేదనిపించాడు. శుభమ్ రంజనే 2 ఓవర్లలో 12 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే మిగిలిన బౌలర్లందరూ జగదీశన్, బదోని దెబ్బకు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ భారీ స్కోరు చూస్తుంటే టీమిండియా కుర్రాళ్లు వరల్డ్ కప్ కోసం ఏ రేంజ్ లో సిద్ధమయ్యారో అర్థమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *