Mohammed Siraj : ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ నుండి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా గుర్తుకు వచ్చి సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా వెళ్లేటప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి సిరాజ్ వివరించాడు. ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, బీసీసీఐ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సిరాజ్ మాట్లాడుతూ.. “జస్సీ భాయ్ (బుమ్రా) వెళ్లేటప్పుడు, నేను అతడిని ‘భయ్యా, ఎందుకు వెళ్తున్నారు? నేను ఐదు వికెట్లు తీస్తే ఎవరిని కౌగిలించుకోవాలి ? అని అడిగాను” అని చెప్పాడు.
సిరాజ్ ప్రశ్నకు బుమ్రా ఇచ్చిన సమాధానం చాలా హృద్యంగా ఉందని సిరాజ్ తెలిపాడు. “నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఐదు వికెట్లు తీసుకో చాలు” అని బుమ్రా బదులిచ్చాడని సిరాజ్ తెలిపాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడేందుకు బౌలర్లకు చాలా మంచి అవకాశం లభిస్తుందని సిరాజ్ చెప్పాడు. “ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండటం ఆనందంగా ఉంది. కానీ, మనం మ్యాచ్ గెలిస్తే ఇంకా బాగుంటుంది” అని సిరాజ్ అన్నాడు. మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 35.67 సగటుతో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో బెన్ స్టోక్స్ (17 వికెట్లు) ఉన్నాడు.
The trust, the belief and enjoying each other’s success 🙌
Prasidh Krishna and Mohd. Siraj sum up #TeamIndia‘s spirited comeback with the ball ⚡️⚡️
WATCH 🎥🔽#ENGvIND | @prasidh43 | @mdsirajofficialhttps://t.co/4XnX47iy0S
— BCCI (@BCCI) August 2, 2025
ఐదవ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి 23 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా, ఆకాష్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, టీమిండియా 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా తరపున ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండగా, ఆకాశ్ దీప్ సింగ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 7 పరుగులు, సాయి సుదర్శన్ 11 పరుగులు చేసి తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..