Mohammed Siraj : ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ చారిత్రక 6 పరుగుల విజయంలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు తీసి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను బెంబేలెత్తించాడు. ఈ సుదీర్ఘమైన స్పెల్స్ వేసినా అతను ఎక్కడా అలసిపోయినట్టు కనిపించలేదు. దీనిపై అతని సోదరుడు మహమ్మద్ ఇస్మాయిల్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మహమ్మద్ ఇస్మాయిల్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. సిరాజ్ తన ఫిట్‌నెస్ పట్ల చాలా సీరియస్‌గా ఉంటాడని, జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడని చెప్పాడు. “సిరాజ్ తన ఫిట్‌నెస్‌పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అతను జంక్ ఫుడ్ అస్సలు తినడు. కఠినమైన డైట్‌ను ఫాలో అవుతాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా బిర్యానీ చాలా తక్కువగా తింటాడు. ఒకవేళ తినాలనుకుంటే ఇంట్లో చేసినది మాత్రమే తింటాడు. పిజ్జా లేదా ఫాస్ట్ ఫుడ్ లాంటివి అస్సలు ముట్టుకోడు” అని ఇస్మాయిల్ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సిరాజ్‌కు చోటు దక్కనప్పటికీ, అతను నిరాశ చెందకుండా కఠినంగా శ్రమించాడని ఇస్మాయిల్ వెల్లడించాడు. సిరాజ్ ఎప్పటికీ ఓడిపోడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కనప్పుడు కూడా అతను నిరుత్సాహపడలేదు. మరింత కఠినంగా శ్రమించడం మొదలుపెట్టాడు. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్, జిమ్, ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టాడు. ఒక ఆటగాడిగా తనలో ఉన్న లోపాలను తెలుసుకుని, వాటిని సరిదిద్దుకున్నాడని ఇస్మాయిల్ చెప్పాడు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అతను మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. 5 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో 32.43 సగటుతో ఈ వికెట్లు తీశాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. ఓవల్ టెస్టులో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరాజ్ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ సిరీస్‌ను సమం చేయడమే కాకుండా, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ పరుగుల తేడాతో (6 పరుగులు) విజయం సాధించింది. ఇప్పుడు సిరాజ్ దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు కోల్పోయిన తర్వాత వన్డే జట్టులోకి తిరిగి రావడంపై ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..