ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో మెట్రో నిర్మాణం చేపట్టే ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇప్పటికే ఈ రెండు నగరాల్లో మెట్రో నిర్మాణాలకు కేంద్రం అనుమతులు కూడా జారీ చేసింది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు రెడీ అవ్వగా.. కేంద్ర ప్రభుత్వానికి గతంలో పంపించారు. ఈ డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేర్పుల చేసి కేంద్రం త్వరలో ఆమోదించనుంది. విజయవాడ మెట్రోకు కొన్ని సవరణలను చేయాలని పరిశీలిస్తుండగా.. త్వరలోనే దానికి కూడా కేంద్రం నుంచి ఆమోదం లభించనుంది. దీంతో ఈ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి ఇది ముందడుగుగా చెప్పవచ్చు.
మొత్తం రూ.42 వేల కోట్లతో ప్రాజెక్ట్
విజయవాడ, విశాఖపట్నం మెట్రో నిర్మాణానికి రూ.42 వేల కోట్లు అవసరమవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి దశ పనులకు రూ.22 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఇక విశాఖ మెట్రో కోసం రూ.12 వేల కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.11 వేల కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. విశాఖ మెట్రో నిర్మాణంలో కేంద్రం పాలుపంచుకోనుంది. కేంద్రం 20 శాతం నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈక్విటీ షేర్ 40 శాతంలో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, కేంద్రం 20 శాతం పంచుకోనున్నాయి. ఇక ప్రాజెక్ట్ కోసం అవసరమైన మిగతా నిధులు ప్రపంచ బ్యాంకులు, ఏడీబీ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ రుణాలకు తీసుకునేందుకు కేంద్రం హామీ ఇవ్వనుండగా.. ఏపీ ప్రభుత్వం 30 ఏళ్లల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రూట్లల్లో మెట్రో
-తొలి దశలో విశాఖ స్టీల్ ప్లాంట్-కొమ్మాది కూడలి, గురుద్వారా- పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం- చినవాల్తేరు రూట్లలో మెట్రో నిర్మాణం చేయనున్నారు. మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉండనుంది. ఇక రెండో దశలో కొమ్మాది- భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించనున్నారు. 30.67 కిలోమీటర్ల మేర ఈ లైన్ ఉండనుంది
-తొలి దశలో పీఎన్‌బీఎస్ నుంచి గన్నవరం వరకు ఒక మెట్రో కారిడార్ ఉండనుంది. ఇక రెండో దశలో బస్టాండ్ నుంచి అమరావతి వరకు ఉంటుంది
-విశాఖ, విజయవాడ మెట్రోకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. కానీ కేంద్రం నుంచి డీపీఆర్‌లకు ఇంకా అనుమతి లభించలేదు. త్వరలో డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించనుంది. ఆ తర్వాత పనులు మొదలుకానున్నాయి
-ఇటీవల కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ, విజయవాడ మెట్రోపై చర్చించారు