సిరీస్ రివ్యూ: మయసభ
నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, తాన్య రవిచంద్రన్, దివ్య దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుటు, జ్ఞానశేఖర్
ఇవి కూడా చదవండి
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష
దర్శకులు: దేవా కట్టా, కిరణ్ జయకుమార్
క్రియేటర్: దేవా కట్టా
ఎపిసోడ్స్: 9 (యావరేజ్ డ్యూరేషన్ 40 నిమిషాలు)
తెలుగులో వెబ్ సిరీస్ కల్చర్ మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అయితే అన్నీ టచ్ చేస్తున్నారు కానీ పొలిటికల్ మాత్రం టచ్ చేయడం లేదు. హిందీలో మహారాణి, సిటీ ఆఫ్ డ్రీమ్స్ లాంటి సాలిడ్ పొలిటికల్ సిరీస్‌లు వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాయి. మన దగ్గర అలాంటి ప్రయత్నం చేసారు దేవా కట్టా. రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మయసభ సిరీస్ రూపొందించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. మరి ఇదెలా ఉంది..? రాజకీయంగా ఏదైనా సంచలనాలు క్రియేట్ చేయబోతుందా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
కృష్ణమనాయుడు (ఆది పినిశెట్టి), ఎమ్మెస్ రామిరెడ్డి (చైతన్య రావు) ఇద్దరూ మంచి స్నేహితులు. ఎమ్మెస్సార్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా.. వైద్యుడిగా స్థిరపడతాడు. మరోవైపు నాయుడు మాత్రం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలి.. జనానికి ఏదో ఒకటి చేయాలి అనే కాంక్షతో ఉంటాడు. కాలేజ్ లైఫ్‌తో నాయుడు, రెడ్డి కలుస్తారు.. ప్రాణ స్నేహితులుగా మారతారు. విధి ఈ ఇద్దరినీ ఒకే పార్టీలో చేరేలా చేస్తుంది.. ఇద్దరూ చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు.. ఆ తర్వాత నాయుడు మామ, తెలుగు తెర ఇలవేల్పు అయిన అగ్ర నటుడు ఆర్‌సీఆర్ (సాయి కుమార్) రాజకీయ పార్టీ పెట్టడంతో అక్కడికి వెళ్లిపోతాడు. అలా అప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్న నాయుడు, రెడ్డి రాజకీయంగా విరోధులు అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..
కథనం:
ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దేవా కట్ట. సినిమాలు ఫాలో అయ్యే వాళ్లకు ఈయన గురించి చెప్పనక్కర్లేదు. దేవా కట్టా అనే పేరు చూసి సినిమాకు వెళ్లే వాళ్లు కూడా లేకపోలేదు. తక్కువ సినిమాలే చేసినా కానీ వచ్చిన గుర్తింపు మాత్రం ఎక్కువే. ప్రస్థానంతో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలకు ఈయన కేరాఫ్‌గా మారిపోయాడు. ఈరోజుకు కూడా తెలుగులో బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఏది అంటే మరొక ఆలోచన లేకుండా ప్రస్థానం అంటారు. దేవ కట్ట ఆలోచన శైలి ఎలా ఉందో ఈ సినిమా చూస్తే అర్థమయిపోతుంది. అంత అద్భుతమైన సినిమా తీసిన ఈయన.. ఆ తర్వాత పొలిటికల్ సినిమాలకు దూరం అయిపోయాడు. ఇలాంటి సమయంలో సినిమాలు కాదని మయసభ అనే వెబ్ సిరీస్ చేసాడు. రాష్ట్ర కేంద్ర రాజకీయాలను మలుపు తెప్పిన ఎన్నో సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ రూపొందించాడు దేవా కట్ట.
కల్పితం అని ఆయన చెప్తున్నాడు కానీ ఇందులో ఉన్న ప్రతీ పాత్ర మనకు నిజంగా కనిపించేదే.. ఎక్కడో ఓ చోట పలకరించేదే. 1975 నుంచి 1995లో ఆశ్రమ్ (వైస్రాయ్) హోటల్ వరకు దేశంలో జరిగిన ప్రతి సంఘటనను టచ్ చేస్తూ ఈ సిరీస్ తెరకెక్కించాడు. ఎపిసోడ్స్ వైజ్‌గా చూసుకుంటే మొదటి ఎపిసోడ్ నుంచి మూడు ఎపిసోడ్స్ వరకు రెడ్డి, నాయుడు క్యారెక్టర్స్ పరిచయం కోసమే తీసుకున్నాడు. అలాగే విజయవాడ రాజకీయాలు కూడా టచ్ చేసాడు. అక్కడ మోహన్ రధా, రంగా క్యారెక్టర్స్‌ను గుర్తు చేసేలా కుల రాజకీయాలు చూపించారు మేకర్స్. చాలావరకు వాస్తవిక సంఘటనలే ఈ సిరీస్‌లో ఉన్నాయి. అడుగడుగునా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలే కళ్ల ముందు కనిపిస్తాయి. అందుకే ఇది నిజం లాంటి అబద్ధం అంటూ ప్రమోట్ చేసాడు దేవా కట్టా. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి అని చూడగానే అర్థమవుతుంది. వాళ్లనే కృష్ణమ నాయుడు, ఎమ్మెస్ రామిరెడ్డిగా చూపించాడు. కానీ అదేం లేదు.. మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను అంటూ తన వాదన వినిపిస్తున్నాడు దేవా కట్ట.
ముందే చెప్పాను కదా వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలు తన సిరీస్‌లో రాసుకున్నా అని అంటున్నాడు ఈ దర్శకుడు. విజయవాడ కుల రాజకీయం.. రాయలసీమ ఫ్యాక్షనిజం.. చంద్రబాబు నాయుడు ఫ్లాష్ బ్యాక్.. ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ క్యారెక్టర్స్.. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ అమలుపరచిన కుటుంబ నియంత్రణ.. సీమలో రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి చేసిన ఫ్యాక్షనిజం.. ఇలా ఒక్కటేంటి సిరీస్ నిండా ఎన్నో సంఘటనలు గుర్తు చేసేలా ఉన్నాయి. అవన్నీ కేవలం కల్పితాలు అని దేవా కట్ట చెప్పినంత మాత్రాన నమ్మలేం.. అలాగని నేను అన్ని అబద్ధాలే చెప్పానని కూడా చెప్పట్లేదు దేవా కట్టా. మీరు కనెక్ట్ అయితే నా తప్పు కాదంటున్నాడు. 6వ ఎపిసోడ్ నుంచి స్పీడ్ పెరుగుతుంది. అక్కడ్నుంచి రెడ్డి, నాయుడు రాజకీయంగా ఎదుగుతుండటంతో స్క్రీన్ ప్లే కూడా ఫాస్టుగానే వెళ్లిపోయింది. 8వ ఎపిసోడ్‌లో కథనం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. నక్సలిజాన్ని కూడా ఇందులో చాలా బాగా చూపించాడు. చివరి ఎపిసోడ్ అంతా చాలా వేగంగా వెళ్లిపోతుంది. సెకండ్ సీజన్ లీడ్ కూడా చాలా బాగా ఇచ్చాడు దేవా కట్టా.
నటీనటులు:
కృష్ణమనాయుడు పాత్రలో ఆది.. ఎమ్మెస్సార్ పాత్రలో చైతన్య రావు అద్భుతంగా నటించారు. ఇద్దరికి ఇద్దరూ చాలా బాగా సెట్ అయ్యారు. అలాగే తాన్య రవిచంద్రన పోషించిన హీరోయిన్ పాత్ర కూడా కొందరిని గుర్తు చేస్తుంది. RCR పాత్రలో సాయి కుమార్ అదరగొట్టాడు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర కామెడీ పండించింది. సందీప్ బసూగా నటించిన సకుల్ శర్మ, ఐరావతిగా నటించిన దివ్యా దత్తా చాలా బాగున్నారు. మరో కీలక పాత్రలో రవీంద్ర విజయ్ నటన బాగుంది. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
ఇంత పెద్ద సిరీస్ చేస్తున్నపుడు మ్యూజిక్ కీలకం. అందులో ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ చాలా బాగా తన పాత్ర పోషించాడు. ఎడిటర్ ప్రవీణ్ కూడా షార్ప్ కట్స్‌తో రక్తి కట్టించాడు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక క్రియేటర్ దేవా కట్టా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంత పెద్ద కథ రాసుకుంటున్నపుడు కచ్చితంగా చాలా వివాదాలు వస్తాయి.. అవన్నీ తెలిసి కూడా ధైర్యంగా తాను అనుకున్నది తెరకెక్కించాడు ఈయన. సిరీస్‌లో చాలా సన్నివేశాలు ఒరిజినాలిటీని స్పృషించాయి. ఒకవేళ అవి కాంట్రవర్సీ అయితే మాత్రం కచ్చితంగా దేవా కట్టా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన రైటింగ్ చాలా బలంగా ఉంది. ఆయనకు కిరణ్ జయకుమార్ బాగా తోడ్పాటు అందించాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఈ మయసభ.. కేంద్ర రాష్ట్ర రాజకీయాలకు అద్దం.. తెలుగులో బెస్ట్ పొలిటికల్ వెబ్ సిరీస్..!
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..