జలందర్, జూన్ 25: పంజాబ్‌లోని జలంధర్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ మహిళ ఇంటికి నిప్పంటించాడో సైకోగాడు. ఈ ఘటనలో మహిళతోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన శనివారం (ఆగస్టు 3) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అగ్నిప్రమాదం సమయంలో సుఖ్వీందర్ కౌర్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో ఉంది. ఈ ఘటనలో ముగ్గురికీ కాలిన గాయాలు కావడంతో వారిని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. ఈ సంఘటన రామమండి ఫేజ్-2లోని ఏక్తా నగర్‌లో జరిగింది. బాధిత మహిళ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఓ కూరగాయల వ్యాపారి తన కుమార్తెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని, అందుకు ఆమె తిరస్కరించినందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి తెలిపింది.
కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సుఖ్వీందర్ కౌర్ ఇంటికి తరచూ కూరగాయలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో అతడు ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదనను తీసుకువచ్చాడు. అప్పటికే ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన సదరు మహిళ అతనిని చెంపదెబ్బ కొట్టింది. ఈ చర్యతో ఆమెపై పగ పెంచుకున్న వ్యాపారి పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి, మహిళ ఇంటి గోడపైకి ఎక్కి ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న సుఖ్వీందర్ కౌర్, ఆమె ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు రామ మండి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.