మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియలో సాయపడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే హానికరమైన విష పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేలా చేస్తుంది. అందుకే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహజమైన ఆహారాలు, ముఖ్యంగా మన భారతీయ వంటల్లో వాడే కొన్ని సూపర్‌ఫుడ్‌లు చాలా బాగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ
ఉసిరిలో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి లివర్ కణాలను మళ్లీ పెరిగేలా చేసి వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం లివర్‌లో వాపును తగ్గించి కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఇది జీర్ణక్రియకు అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంలో కూడా సాయపడుతుంది.
బొప్పాయి
బొప్పాయి లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి లివర్‌పై ఒత్తిడిని తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్, కైమోపాపైన్ అనే ఎంజైమ్‌లు శరీరంలోని మంటలను తగ్గించి లివర్‌ను శుభ్రం చేస్తాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్, సెలీనియం లివర్ బాగా పనిచేయడానికి సాయపడతాయి. ఇవి లివర్ ఎంజైమ్ లను ప్రేరేపించి రక్తంలోని విష పదార్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి. అలాగే ఫ్యాటీ లివర్ ను తగ్గించడంలో కూడా ఇది చాలా మేలు చేస్తుంది.
కొత్తిమీర
కొత్తిమీర కూడా లివర్‌ను సహజంగా శుభ్రం చేస్తుంది. ఇందులో ఉండే పదార్థాలు శరీరంలోని హానికరమైన లోహాలను, ఇతర విషాలను బయటకు పంపడంలో సాయపడతాయి.
బీట్‌రూట్
బీట్‌రూట్‌లో ఉండే బీటాలైన్లు అనే యాంటీఆక్సిడెంట్లు లివర్ కణాల్లోని వాపును, ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజూ బీట్‌రూట్ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మెంతి గింజలు
మెంతి గింజలు లివర్ డిటాక్స్‌లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తూ లివర్‌పై పని భారం తగ్గేలా చేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)