చికెన్, మటన్ లివర్‌లో ఐరన్, విటమిన్ ఎ, బి12, ఫోలేట్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి, కంటి సమస్యలతో బాధపడేవారికి, ఇమ్యూనిటీ బలహీనమైనవారికి లివర్ తినడం బాగా హెల్ప్ అవుతుందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ B12తో మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని.. నరాల పనితీరూ బాగుంటుందంటున్నారు.
అయితే… ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ.. మోతాదు ఎక్కువైతే హానికరం. రోజుకు 100 గ్రాముల లివర్ తింటే డైలీ లిమిట్‌కు 10 రెట్లు విటమిన్ ఎ లభిస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్ కావడంతో శరీరంలో విటమిన్ ఎ టాక్సిసిటీకి దారి తీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా ఎక్కువ తీసుకుంటే తలనొప్పి, ఐ ఫోకస్ దెబ్బతినడం, కాలేయం–కిడ్నీలపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.
గర్భిణులు, చిన్నపిల్లలు అయితే మరింత జాగ్రత్త అవసరం. గర్భస్థ శిశువు ఆరోగ్యంపై విటమిన్ ఎ అధిక మోతాదు ప్రభావం చూపొచ్చని… 6 నెలలలోపు శిశువులకు లివర్ ఇవ్వొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, లివర్ టాక్సిన్ క్లీన్ చేసే అవయవం కావడం వల్ల… మటన్, చికెన్ లివర్‌లో హెవీ మెటల్ కంటామినేషన్ ఉండే ప్రమాదమూ ఉందని.. కాడ్మియం, లెడ్ వంటివి కిడ్నీ, ఎముకల పనితీరును దెబ్బతీయొచ్చని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
అంతేకాదు, ఇప్పటికే విటమిన్ ఎ సప్లిమెంట్స్, క్యాప్సూల్స్ తీసుకుంటున్నవారు లివర్ తినకూడదని సూచిస్తున్నారు. అందుకే వారానికి ఒకసారి 50–75 గ్రాముల లోపు లివర్ తింటే సేఫ్. గర్భిణులు, చిన్నపిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మితంగా తీసుకుంటే చికెన్ లేదా మటన్ లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ హద్దు మించితే ప్రమాదం.