మారిన జీవనశైలి, రసాయన ఉత్పత్తుల వినియోగం కారణంగా నేడు అనేకమంది ఆరోగ్య, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి సిద్ధమైన పద్ధతులను అనుసరించడం ఎంతో అవసరం. అలాంటి అద్భుతమైన చికిత్సా విధానాల్లో అరిటాకు స్నానం ఒకటి. ఈ పద్ధతిలో పెద్ద అరటి ఆకులను శరీరానికి కప్పుకొని సూర్యరశ్మికి గురికావడం ద్వారా చికిత్స చేస్తారు. అరిటాకుల్లో పుష్కలంగా ఉండే క్లోరోఫిల్, సూర్యరశ్మి సమక్షంలో శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ స్నానం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, శారీరక ఆరోగ్యానికి కూడా అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్య ప్రయోజనాలు:
శరీరంలోని విషపదార్థాల తొలగింపు: అరిటాకు స్నానం చర్మ రంధ్రాలను తెరిచి, చెమట ద్వారా శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది ఒక సహజమైన డీటాక్సిఫికేషన్ ప్రక్రియ.
చర్మ సౌందర్యం: అరటి ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో తోడ్పడుతుంది.
మానసిక ప్రశాంతత: ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల కలిగే ప్రశాంతతను అరిటాకు స్నానంలోనూ అనుభవించవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి, మనసుకు విశ్రాంతినిస్తుంది. ఆందోళన, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి అరిటాకు స్నానం సహాయపడుతుంది. అరటి ఆకులకు సహజంగా చల్లదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది.
శరీర దురదలు, దద్దుర్లు నివారణ: అరిటాకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఏర్పడే దద్దుర్లు, దురదలు, చిన్నపాటి అలర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా చేయాలి?
ఒక ప్రశాంతమైన ప్రదేశంలో, సూర్యరశ్మి నేరుగా పడే చోట పెద్ద అరటి ఆకులను పరవాలి. వాటిపై పడుకుని, శరీరం మొత్తం ఆకులతో కప్పుకోవాలి. పైన ఆకులను ఏదైనా తాడుతో కొంచెం వదులుగా కట్టాలి. కొంత సమయం అరిటాకు లోపల పడుకొని ఉండాలి. ఆ తర్వాత ఆకులను తీస్తే శరీరం నుండి మలినాలు బయటకు పోయినట్లుగా దుర్వాసన వస్తుంది. అనంతరం చల్లటి నీటితో స్నానం చేయాలి. అరిటాకు స్నానం అనేది ఒక సంప్రదాయ పద్ధతి, దీనిని క్రమం తప్పకుండా ఆచరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.