KTR: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్!

KTR: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్!


అనారోగ్యంతో గురువారం హాస్పిటల్‌లో చేరిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం గురువారం సాయంత్రం ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు కేటీఆర్ తెలిపారు. ఆయనకు బ్లడ్‌ షుగర్‌, సోడియం స్థాయిలను పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు పాటు హాస్పిటల్‌లోనే ఉండాలని వైద్యులు సూచించినట్టు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌కు ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ క్షేమం గురించి ఆలోచిస్తూ, ఆరా తీస్తున్న ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ రాసుకొచ్చారు.

కేటీఆర్‌ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ను చూడండి…

మాజీ సీఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌కు వచ్చారు. గత రెండు మూడు రోజులుగా నీరసంగా ఉండడంతో తన వ్యక్తిగత వైద్యుడి సలహామేరకు ఆయన హాస్పిటల్‌లో చేశారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు గురువారం రాత్రి 9.30 గంటలకు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. నీరసంగా ఉండడంతో కేసీఆర్ హాస్పిటల్‌కు వచ్చారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఆయన రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కాస్తా ఎక్కువగా.. సోడియం లెవల్స్‌ కాస్తా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ రెండు సాధారణ స్థాయికి వచ్చేంత వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని డాక్టర్‌ స్పష్టం చేశారు.

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వైద్యులకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *