ఉల్లిపాయలపై నల్ల మచ్చలుంటే అది ఆస్పెర్గిల్లస్ నైజర్ అనే ఫంగస్ వల్ల ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఈ రకమైన ఫంగస్ నేలలో కనిపిస్తుంది. ఉల్లిపాయలను సంచులు లేదా మూసి ఉన్న కంటైనర్లలో నిల్వ చేసినప్పుడు, గాలి సరిగ్గా లేని ప్రదేశాలలో, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో నిల్వ చేస్తే ఈ ఫంగస్ అభివృద్ధి చెందుతుంది.
ఉల్లిపాయపై ఫంగస్ బయటి పొరపై పెరగడం ప్రారంభమవుతుంది. ఇది నల్లటి పొడి అవశేషాలను సృష్టిస్తుంది. ఉల్లిపాయ బయటి చర్మం దెబ్బతిన్నట్లయితే నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫంగస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయలపై ఉన్న ఈ నల్ల మచ్చల వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తదని అంటున్నారు. అటువంటి ఉల్లిపాయలను శుభ్రం చేసి, ఫంగల్ పొరను తొలగించడం ద్వారా ఉపయోగించవచ్చు అంటున్నారు.
నల్లటి మచ్చలు ఏర్పడిన ఉల్లిపాయలను వండడానికి ముందు వాటిని తొక్క తీసి బాగా కడగాలని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఈ నల్ల శిలీంధ్రం కొన్ని విష పదార్థాలను విడుదల చేసే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అలెర్జీలు, ఉబ్బసం, శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచించారు. అలాగే కొంతమంది ఉల్లిపాయలను ఫ్రిజ్లో పెడుతుంటారు. ఇలా చేయటం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచుతుంటే, దానిపై ఎటువంటి నల్లటి ఫంగస్ ఉండకూడదని చెబుతున్నారు..