Kishan Reddy: రిజర్వేషన్ల పేరుతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు: కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

Kishan Reddy: రిజర్వేషన్ల పేరుతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు: కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..


ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అప్పుల కోసం రేవంత్ సర్కార్ అర్రులు చాస్తోందంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిస్సాహయతను కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హామీలకు రేవంత్‌ మాత్రమే బాధ్యులు కాదు.. రాహుల్, సోనియా కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క డిక్లరేషన్‌ను అమలుచేయడం లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మైనార్టీ, యూత్, రైతు, బీసీ డిక్లరేషన్‌లో పేరుతో ఆయా వర్గాలను మోసం చేశారని విమర్శించారు. ఈ డిక్లరేషన్‌లన్నీ ఏమైపోయాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్ కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు, ఏమైందని.. హామీలు అమలుచేయకుండా ఢిల్లీ బాట పట్టి స్థాయికి మించి మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు.

42% బీసీ రిజర్వేషన్ల అమలులో చట్టబద్ధతలను సీఎం రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకోలేదని.. తెలంగాణ సీఎం రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా విఫలమయ్యారని కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించినప్పుడు హైకోర్టు మత ఆధారిత రిజర్వేషన్లను కొట్టివేసిందంటూ కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10% ముస్లిం రిజర్వేషన్లను జోడించడం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ కాలానికి ముందు 34% నుండి 32%కి తగ్గించిందన్నారు.

ఢిల్లీ ప్రదక్షిణ తప్పా.. 18 నెలల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దాల మేడలో కూర్చొని రాహుల్, రేవంత్ ఇతరులపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. సామాజిక సాధికారిత కల్పించే విషయంలో రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు వస్తే, ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ జీరో పార్టీగా మారిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు పొరపాటు చేశామని పశ్చాత్తాప పడుతున్నారని.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన మీటింగ్‌.. సోనియా ఫ్యామిలీని పొగడటానికి, ప్రధాని మోదీని విమర్శించడానికి తప్పా ఎవరికి ఒరిగింది ఏమీ లేదన్నారు.

అవినీతిలో కాంగ్రెస్-బీఆర్ఎస్‌తో పోటీ పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్‌ హోల్‌సేల్ అవినీతికి పాల్పడితే.. కాంగ్రెస్ రిటేల్‌గా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నించారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు పెట్టి.. మత కల్లోలాలు తీసుకు రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి దేశానికి రోల్‌ మోడల్‌గా నిలవాలనుకుంటున్నారా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *