King Cobra: ఇది తెలుసా.! మిగతా పాములతో పోలిస్తే కింగ్ కోబ్రా ఇందుకే స్పెషల్.. అదేంటంటే.?

King Cobra: ఇది తెలుసా.! మిగతా పాములతో పోలిస్తే కింగ్ కోబ్రా ఇందుకే స్పెషల్.. అదేంటంటే.?


కింగ్ కోబ్రాలను చూస్తే చాలామందికి భయం, వణుకు పుడతాయి. దాదాపు 12 అడుగులకు పైగా పొడవుండి, నిటారుగా పడగెత్తి బుసకొట్టే ఈ సర్పం సహజంగానే మనుషుల్లో ఆందోళన కలిగిస్తుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రతినిధులు కింగ్ కోబ్రాల వల్ల ప్రమాదాల కంటే ప్రయోజనాలే అధికమని, జీవ సమతౌల్యానికి ఇవి కీలకమని చెబుతున్నారు. ఈ సంస్థ మనుషులకు భయం కలిగినప్పుడు వాటిని చంపేయకుండా తమకు ఫోన్ చేయాలని కోరుతోంది.

కింగ్ కోబ్రాలు సహజంగా మనుషులకు భయపడతాయి, పిరికివి. అవి మనుషులను తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాయి. తమకు ప్రమాదమని భావించినప్పుడు మాత్రమే పడగ విప్పి, మూడు నాలుగు అడుగుల ఎత్తువరకు పైకి లేచి భయపెడతాయి. ఈ భయం కారణంగానే మనుషులు వాటిని చంపేస్తున్నారు. విషపూరిత పాములలో కింగ్ కోబ్రా ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని వి.మాడుగుల, చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, పార్వతీపురం తదితర తూర్పు కనుమల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కింగ్ కోబ్రాలు అడవులను తమ ఆవాసంగా చేసుకుంటాయి. ఇక్కడ వెదురు ఆకులతో గూడు కట్టి గుడ్లు పెడతాయి. వాటికి నీరు నిరంతరం అవసరం కాబట్టి, వాటర్ ఛానెల్స్, కాలువల దగ్గర నివసించడానికి ఇష్టపడతాయి. మందపాటి అడవులు, వెదురు పొదలు వాటికి ఆశ్రయాన్ని అందిస్తాయి.

కింగ్ కోబ్రాల వల్ల కరిచి చనిపోయిన కేసులు చాలా అరుదు. నాగుపాము, కట్లపాము, పొడపాము లాంటి ఇతర విషసర్పాల కాటుతో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. ఈ విషసర్పాలను కింగ్ కోబ్రా ఆహారంగా తీసుకుంటుంది. తద్వారా, ఇవి ఇతర విషసర్పాల సంఖ్యను నియంత్రించి, పరోక్షంగా మనుషుల ప్రాణాలను కాపాడుతాయని ఆ సంస్థ సిబ్బంది అంటోంది. కింగ్ కోబ్రా గుడ్లను పెట్టే విధానం ప్రత్యేకమైనది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జత కడతాయి. మే చివరిలో లేదా జూన్ నెలలో గుడ్లు పెడతాయి. ఆడ కింగ్ కోబ్రా ప్రపంచంలో ఇంకే సర్పమూ చేయని విధంగా, వెదురు ఆకులు, చిన్న చిన్న పుల్లలతో గూడు కడుతుంది. ఈ గూటిలో 30 నుండి 40 గుడ్లను పెట్టి, సుమారు ఒకటిన్నర నెలపాటు ఆహారం తీసుకోకుండా వాటిని రక్షిస్తుంది. గుడ్లు పొదిగిన తర్వాత, ఆడ కోబ్రా ఆహారం కోసం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆగస్టు మొదటి లేదా రెండవ వారంలో గుడ్లలో నుండి కింగ్ కోబ్రాలు బయటకు వస్తాయి. 80 నుండి 90 శాతం గుడ్లు పొదుగుతాయి. వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం కింగ్ కోబ్రాలను హింసించినా, చంపినా శిక్షార్హులు అవుతారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.కింగ్ కోబ్రాలు అంతరించిపోతున్న జాతులలో ఒకటి. తూర్పు కనుమలలోని ఎప్పటికీ పచ్చగా, చల్లగా ఉండే అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *