
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లిని అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. సామర్లకోట పరిధి సీతారామ కాలనీలో దారుణం జరిగింది. తల్లితోపాటు ఇద్దరు కుమార్తెలు హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు తలలు పగులగొట్టి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
సీతారామకాలనీలో ప్రసాద్, మాధురి అనే దంపతులు.. వారి ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రసాద్ స్థానికంగా ఉన్న ఒక పరిశ్రమలో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత రాత్రి డ్యూటీ ఉందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం(ఆగస్టు 3) ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, ఇద్దరు కుమార్తెలు రక్తపు మడుగులో పడి ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ముగ్గురి చంపి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను మాధురి (30), ఆమె బిడ్డలు పుష్పకుమారి (5), జెస్సిలోవ (5)గా గుర్తించారు. ముగ్గురి తలలపై బలంగా మోది హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ప్రసాద్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రశాంతంగా ఉండే సీతారామ కాలనీలో ఒకేసారిగా తల్లీకూతుళ్ల హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..