హైదరాబాద్, ఫిబ్రవరి 10: జేఈఈ మెయిన్ 2026 తొలి సెషన్ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన కీపై చాలా తప్పులు ఉన్నాయంటే విమర్శలు వస్తున్నాయి. ది కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ) స్పందిస్తూ ఆన్సర్ కీలో తప్పులను ఎత్తి చూపారు. ఈ తప్పులు విద్యార్థుల ర్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మొత్తం 17 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చినట్లు సీఎఫ్‌ఐ ఎత్తి చూపింది. అస్పష్టమైన పదాలు, గణన తప్పులు, ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఇవ్వడం వంటి తప్పిదాలు దొర్లినట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రశ్నలకుగాను విద్యార్థులకు బోనస్ మార్కులు ఇవ్వాలని సీఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.
కాగా జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుంచి జనవరి 29 మధ్య దాదాపు 13 లక్షల మంది ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. ఎన్టీయే ఈ పరీక్షల ఆన్సర్ కీలను ఫిబ్రవరి 4న విడుదల చేసింది. ప్రొవిజనల్ కీపై ఫిబ్రవరి 6 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఈ క్రమంలో సీఎఫ్‌ఐ మొత్తం 17 ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్లు ఎత్తిచూపింది. స్పష్టత లేని వాక్యాలు, గణించడంలో తప్పులు, తప్పుడు ఆప్షన్లు , ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు వచ్చాయని పేర్కొంది. ముఖ్యంగా 10 ప్రశ్నలు ప్రాథమికంగానే లోపభూయిష్టంగా ఉన్నట్లు సీఎఫ్‌ఐ వెల్లడించింది. వాటిని బోనస్ ప్రశ్నలుగా పరిగణించాలని డిమాండ్ చేసింది. మిగిలిన ఏడు ప్రశ్నలకు తప్పు సంఖ్యా విలువలు, తప్పు ఎంపికలు, బహుళ సరైన సమాధానాలు వంటి సమస్యలు ఉన్నాయి. వివాదాస్పద ప్రశ్నలలో ఎక్కువ భాగం ఫిజిక్స్ నుంచే వచ్చాయి.
ఇటువంటి తప్పులు విద్యార్థుల ర్యాంకింగ్‌లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ఒక మార్కు తేడా కూడా ర్యాంక్‌లో పెద్ద మార్పులకు దారితీస్తుందని CFI వాదించింది. బోనస్ ప్రశ్నలను పరిగణించాలనే డిమాండ్‌తో పాటు, అభ్యంతర ప్రక్రియను కూడా CFI విమర్శించింది. విద్యార్థులు తమది కాని తప్పులను సవాలు చేయడానికి ప్రతి ప్రశ్నకు రూ. 200 చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. ఆన్సర్ కీలలో తప్పులు పునరావృతం అవుతున్నాయని, గతేడాది కూడా JEE మెయిన్ సెషన్ 2 జవాబు కీలో తొమ్మిది తప్పులు ఉన్నట్లు సీఎఫ్‌ఐ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.