జాహ్నవి కందుల.. కోటి ఆశలతో ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుతుండగా.. అక్కడి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని దుర్మరణం చెందింది. ఈ కేసు విచారణకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్స్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగింది. దీనిపై సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారిక ప్రకటన చేశారు. జహ్నవి మృతి తీవ్ర విచారకరమని.. తాము అందించే పరిహారం ఆమె కుటుంబానికి కొంతైన స్వాంతన చేకూరుస్తుందని తాము భావిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
జాహ్నవి ఏపీలోని కర్నూలుకు చెందిన అమ్మాయి. 2021 హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్లింది. అక్కడి నార్త్ ఈస్ట్రన్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ కోర్సు జాయిన్ అయింది. 2023, జనవరి 23 తేదీన.. ఆమె రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో 100 అడుగుల దూరంలో ఎగిరిపడిన.. జాహ్నవి స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయింది. పోలీస్ వాహనం డ్రైవ్ చేస్తున్న కెవిన్ డవే అనే అధికారి ఈ ప్రమాదానికి కారణమయ్యారు. అయితే ఆమె మృతిపై మరో అధికారి డేనియల్ ఆడరర్.. అత్యంత నిర్లక్ష్యంగా జోకులు వేస్తూ మరో అధికారితో మాట్లాడటం తీవ్ర వివాదస్పదమైంది. ఆమె మరణానికి పెద్దగా విలువ లేదు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాతం 40 కిలోమీటర్లు జోన్‌లో ఉండగా.. అధికారి దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసినట్లు సమాచారం. దీనిపై భారత్ భగ్గుమంది. నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటు అమెరికా పౌరులు సైతం అధికారి తీరును ఖండించారు. దీంతో అతను వేటు పడింది. విధుల నుంచి పోలీస్ ఎజెన్సీ తప్పించింది.
Also Read: కొండ పిండి కూర.. తిన్నారంటే అద్భుతమే…