మహిళల్లో ఎక్కువగా కనిపించేది.. కానీ చాలా మంది పట్టించుకోని ఐరన్ లోపం లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐరన్ ఎర్ర రక్త కణాల తయారీలో చాలా ముఖ్యం. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ మన శరీరంలోని అన్ని భాగాలకి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే.. హిమోగ్లోబిన్ సరిగ్గా తయారు కాదు. దీని వల్ల రక్తహీనత వస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం.. 15 నుండి 49 సంవత్సరాల వయస్సులో ఉన్న మహిళల్లో సుమారు 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భిణీ మహిళల్లో ఈ శాతం మరింత ఎక్కువగా 37 శాతం వరకు ఉంటుంది.
చాలా మంది వైద్యులు రక్తంలోని ఐరన్ స్థాయిని మాత్రమే పరీక్షిస్తారు. కానీ మన శరీరంలో ఎంత ఐరన్ నిల్వ ఉందో తెలుసుకోవడానికి ఫెర్రిటిన్ అనే పదార్థాన్ని కూడా పరీక్షించడం చాలా అవసరం. ఎందుకంటే రక్తంలోని ఐరన్ స్థాయి సాధారణంగా ఉన్నప్పటికీ.. ఫెర్రిటిన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. మహిళల్లో సాధారణంగా కనిపించే ఐరన్ లోపం లక్షణాల గురించి తెలుసుకుందాం.
అలసట
ఐరన్ లోపం ఉన్నవారికి తరచుగా శక్తి లేనట్లు చాలా బలహీనంగా అనిపిస్తుంది. దీన్ని చాలా మంది శారీరక శ్రమ వల్లనో, నిద్ర లేకపోవడం వల్లనో వచ్చిందని అనుకుని పట్టించుకోరు. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. సరైన నిద్ర ఉన్నా.. పెద్దగా పని చేయకపోయినా ఇలా అనిపిస్తే అది మామూలు విషయం కాదని వైద్యులు చెబుతున్నారు.
తల తిరగడం
మీరు కూర్చున్న స్థితి నుంచి వెంటనే లేచినప్పుడు తల తిరిగినట్లు అనిపించడం లేదా కళ్ళ ముందు చీకటిగా మారడం లాంటివి ఐరన్ లోపం లక్షణాలు కావచ్చు. ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతుంది. చాలా మంది దీన్ని డీహైడ్రేషన్ వల్ల వచ్చిందని అనుకుంటారు.
చల్లటి చేతులు
కొందరికి వేసవి కాలంలో కూడా చేతులు, కాళ్ళు చల్లగా అనిపిస్తాయి. ఇది సాధారణ లక్షణం కాదు. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీని వెనుక ఐరన్ లోపం ఒక కారణం కావచ్చు. రక్తం సరిగ్గా ప్రసరిస్తేనే శరీరం వేడిగా ఉంటుంది. చాలా మంది ఈ లక్షణాన్ని అసలు పట్టించుకోరు.
ఈ లక్షణాలు మీకు కనిపిస్తే కేవలం మామూలు ఐరన్ స్థాయిని మాత్రమే కాకుండా.. ఫెర్రిటిన్ స్థాయిని కూడా పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఫెర్రిటిన్ పరీక్ష మన శరీరంలో నిజమైన ఐరన్ నిల్వ స్థాయిని తెలియజేస్తుంది. లోపాలు బయటికి కనిపించకుండా శరీరంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)