Headlines

Instagram: 16 గంటల వాడకం వ్యసనం కాదు.. TV చూసినట్టేనని ఇన్‌స్టా CEO వాదన

Instagram: 16 గంటల వాడకం వ్యసనం కాదు.. TV చూసినట్టేనని ఇన్‌స్టా CEO వాదన


లాస్ ఏంజిల్స్ కోర్టులో జరుగుతున్న ఈ విచారణ ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎనిమిదేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌ను నడిపిస్తున్న మొస్సేరి.. బాధితుల తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక యువతి తన జీవితం నాశనమవ్వడానికి ఇన్‌స్టాగ్రామే కారణమని వేసిన పిటిషన్ ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీల బాధ్యతపై పెద్ద చర్చకు దారితీసింది.

16 గంటల వాడకం.. అడిక్షన్ కాదా?

విచారణ సందర్భంగా ఈ కేసులో ప్రధాన బాధితురాలు ఒకే రోజులో ఏకంగా 16 గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్ వాడినట్లు తేలింది. దీనిపై మొస్సేరి స్పందిస్తూ.. ఇది ‘సమస్యతో కూడిన వాడకం’ అని అంగీకరించారు కానీ, దానిని ‘వ్యసనం’ అని పిలవడానికి నిరాకరించారు. అర్థరాత్రి వరకు టీవీ షోలు చూడటం ఎలాగో.. గంటల తరబడి సోషల్ మీడియా వాడటం కూడా అలాగేనంటూ ఆయన చేసిన పోలిక కోర్టులో అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీగా వాడటం అంటేనే అది హానికరమైనది కాదని ఆయన వాదించడం గమనార్హం.

బాధితురాలు తనపై జరుగుతున్న వేధింపుల గురించి ఇన్‌స్టాగ్రామ్ వేదికపై ఏకంగా 300 సార్లు రిపోర్ట్ చేసింది. అయితే ఈ విషయం తనకు అసలు తెలియదని మొస్సేరి కోర్టులో అంగీకరించడం గమనార్హం. వినియోగదారుల భద్రత కంటే కంపెనీ వృద్ధిపైనే మెటా దృష్టి పెడుతోందన్న ఆరోపణలకు ఈ సమాధానం బలాన్ని చేకూర్చింది. అలాగే ముఖ రూపురేఖలను మార్చే ఫిల్టర్ల వల్ల యువతలో ఆత్మన్యూనత భావం పెరుగుతోందని అధికారులే గతంలో చర్చించినా.. ఆ ఫిల్టర్లపై నిషేధాన్ని నిశబ్దంగా ఎత్తివేసినట్లు విచారణలో వెల్లడైంది.

కన్నీటి పోరాటం..

కోర్టు వెలుపల అనేకమంది తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన మారియానో జానిన్ అనే తండ్రి తన 14 ఏళ్ల కూతురు మియా ఫోటో పట్టుకుని కన్నీరు మున్నీరయ్యారు. 2021లో తన కూతురు ఆత్మహత్యకు సోషల్ మీడియా వేధింపులే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “వద్దనుకుంటే వారు తమ బిజినెస్ మోడల్ మార్చుకోవచ్చు. పిల్లలను కాపాడే టెక్నాలజీ, నిధులు వారి దగ్గర ఉన్నాయి. కానీ లాభాల కోసమే వారు ఇలా చేస్తున్నారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి.

ఈ కేసులో మెటా మాత్రమే కాదు, యూట్యూబ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సంస్థలు ఇలాంటి క్లెయిమ్స్ పై కోర్టు బయట సెటిల్ చేసుకున్నాయి. అయితే ఈ ట్రయల్ కొనసాగుతున్న కొద్దీ మార్క్ జుకర్‌బర్గ్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ వంటి అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌లు సాక్ష్యం చెప్పడానికి రావాల్సి ఉంటుంది.

ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన కేసు మాత్రమే కాదు.. భవిష్యత్తులో సోషల్ మీడియా సంస్థలు పిల్లల భద్రత విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలో నిర్ణయించే ఒక చారిత్రాత్మక తీర్పుగా మారబోతోంది. సోషల్ మీడియా కంపెనీలు తమ లాభాల కోసం యువత మెదళ్లతో ఆడుకుంటున్నాయన్న ఆరోపణలు నిజమేనా? 16 గంటల వాడకాన్ని కేవలం ‘హెవీ ఎంగేజ్‌మెంట్’ అని కొట్టిపారేయడం సరైనదేనా? టెక్నాలజీ అనేది అభివృద్ధికి తోడ్పడాలి తప్ప ప్రాణాలు తీసేదిగా మారకూడదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *