రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా రైల్వేశాఖ రద్దీ దృష్ట్యా అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఇప్పటికే ఈ రైళ్లను ప్రకటించగా.. రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. అందేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును రైల్వేశాఖ తీసుకొచ్చింది. ఈ రైలు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఏప్రిల్ 2026లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. వసతి, భోజనం, ఇతర సదుపాయాలు కూడా ప్రయాణికులకు కల్పిస్తారు. 10 రాత్రులు, 11 పగళ్లు ఈ టూర్ ఉంటుంది. సికింద్రాబాద్, కామారెడ్డితో పాటు నిజామాబాద్, ధర్మాబాద్, ముద్దేఖ్ రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ కావొచ్చు.
సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణె భీమశంకర్ జ్లోతిర్లింగం, నాసిక్ త్రయంబేశ్వర్ జ్యోతిర్లింగం, ఔరాంగాబాద్ ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారక నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు. మూడు కేటగిరీల సీట్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
స్లీపర్ క్లాస్లో పెద్దలకు రూ.17,600, పిల్లలకు రూ, 16,300 ఛార్జీ ఉంటుంది. థర్డ్ ఏసీలో పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ.25,300 వసూలు చేస్తారు. ఇక సెకండ్ ఏసీలో పెద్దలకు రూ.36,600, పిల్లలకు రూ.32,800 ఉంటుంది.




