న్యూయార్క్ నుంచి వెస్ట్ వర్జీనియాలోని ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తూ తప్పిపోయిన న్యూయార్క్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు మార్షల్ కౌంటీ షెరీఫ్ మైక్ డౌగెర్టీ అధివారం వెల్లడించారు. బాధితులను 85 ఏళ్ల ఆశా దివాన్, 89 ఏళ్ల కిషోర్ దివాన్, 86 ఏళ్ల శైలేష్ దివాన్, 84 ఏళ్ల గీతా దివాన్‌ల అధికారులు గుర్తించారు. ఈ కుటుంబం 2009 మోడల్‌కు చెందిన లైమ్ గ్రీన్ టయోటా EKW2611 నెంబర్ గల వాహనంలో బఫెలో నుంచి పిట్స్‌బర్గ్ మీదుగా వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ‘ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్’ అనే ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డు పక్కన బాధితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తించినట్టు షెరీఫ్ తెలిపారు. ఆ కుటుంబసభ్యులు జూలై 29న పెన్సిల్వేనియాలోని ఈరీ పట్టణంలో ఉన్న బర్గర్ కింగ్ రెస్టారెంట్ వద్ద చివరి సారిగా కనిపించారని అధికారులు తెలిపారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా నలుగురిలో ఇద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది.అంతేకాకుండా వారి చివరి క్రెడిట్ కార్డ్ లావాదేవీ కూడా అదే ప్రదేశంలో జరిగినట్టు అధికారులు గుర్తించారు.
బర్గర్‌కింగ్ షాప్ వద్ద కనిపించిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న వాహనం ఐ-79 అనే హైవేపై దక్షిణ దిశగా వెళ్తున్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ లైసెన్స్ ప్లేట్ రీడర్ ద్వారా అధికారులు గుర్తించారు. కానీ ఈ కుటుంబ తాము చేరుకోవాల్సిన గమన్యాన్ని చేరుకోలేదని అధికారులు తెలిపారు. మౌండ్స్‌విల్లే, వీలింగ్ ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయ్యాయని అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.