IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది. ఆదివారం, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 మహా సంగ్రామం జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ, అభిమానుల మనసులో ఒక చిన్న వెలితి మాత్రం ఉంది. అదే రన్ మెషిన్ విరాట్ కోహ్లీ లేకపోవడం. గత పదిహేనేళ్లలో విరాట్ లేకుండా దాయాది జట్ల మధ్య వరల్డ్ కప్ పోరు జరగడం ఇదే మొదటిసారి. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే విరాట్ కోహ్లీ విశ్వరూపం గుర్తొస్తుంది. పాకిస్థాన్‌పై కోహ్లీకి ఉన్న రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కానీ ఈసారి విరాట్ లేకుండానే భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రస్తుత ఫామ్ పరంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ, కోహ్లీ విరాట్ ఇన్నింగ్స్‌లను ఫ్యాన్స్ ఖచ్చితంగా మిస్ అవుతారు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న తేదీ, వేదికకు కోహ్లీతో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం భారత జట్టుకు అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ ఇప్పటివరకు భారత్-పాక్ మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల్లో రెండింటిని భారత్ గెలుచుకుంది. విశేషమేమిటంటే ఆ రెండు విజయాల్లోనూ విరాట్ కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 2023 ఆసియా కప్‌లో ఇదే మైదానంలో కోహ్లీ సెంచరీ బాదడంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. అలాగే 14 ఏళ్ల క్రితం 2012 టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ అజేయంగా 78 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఇక్కడ జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ భారత్ దే పైచేయి కావడం విశేషం.
ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగడం వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, అంటే 2015 ఫిబ్రవరి 15న అడిలైడ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత్-పాక్ తలపడ్డాయి. ఆ రోజు కూడా ఆదివారమే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ అదే తేదీన, అదే ఆదివారం నాడు ఈ దాయాది జట్లు తలపడుతున్నాయి. అయితే ఆ రోజు సెంచరీ వీరుడు కోహ్లీ ఈరోజు మైదానంలో లేకపోవడం ఫ్యాన్స్‌ను కొంచెం నిరాశకు గురి చేస్తోంది.
కోహ్లీ లేకపోయినా ప్రస్తుత భారత జట్టు పటిష్టంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. పాకిస్థాన్ జట్టు గత కొన్ని నెలలుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతోంది. పైగా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాక్‌పై భారత్‌కు అద్భుతమైన రికార్డు (7-1) ఉంది. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు. విరాట్ లేని లోటును యంగ్ గన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భర్తీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి