IND vs PAK : క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే, అభిమానుల ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మరి మ్యాచ్ జరుగుతుందా? లేదా రద్దవుతుందా? వాతావరణ శాఖ తాజా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. భారత్, శ్రీలంక ఒకే టైమ్ జోన్లో ఉండటంతో మన దేశంలో కూడా అదే సమయానికి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అయితే కొలంబోలో సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, దీనివల్ల టాస్ పడటంలో ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.
బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మొదట ఫిబ్రవరి 15 సాయంత్రం భారీ వర్షం పడుతుందని అంచనా వేశారు. కానీ తాజా అప్డేట్స్ క్రికెట్ ప్రేమికులకు కాస్త ఊరటనిస్తున్నాయి. ముందుగా సాయంత్రం 6 గంటల సమయంలో 51 శాతం ఉన్న వర్షం ముప్పు, ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. సాయంత్రం 7 గంటలకు 40 శాతానికి, రాత్రి 8:30 గంటల సమయానికి కేవలం 27 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. అంటే మ్యాచ్ పూర్తిగా రద్దు కాకపోయినా, కొద్దిసేపు అంతరాయం కలగవచ్చు లేదా ఓవర్లను కుదించే అవకాశం ఉంది.
వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి అమల్లోకి వస్తుంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే కనీసం ఇరు జట్లు ఐదేసి ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అయితే, కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షం తగ్గిన కొద్ది నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేసే సౌకర్యం ఉండటం టీమ్ ఇండియా, పాక్ అభిమానులకు పెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
కొలంబో వాతావరణాన్ని అంచనా వేయడం ఎవరికైనా కష్టమే. కొన్నిసార్లు నిమిషాల్లోనే వాతావరణం మారిపోతుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం.. మ్యాచ్‌కు అంతరాయం కలిగినా, ఫలితం మాత్రం తేలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ లేని లోటుతో ఫీలవుతున్న ఫ్యాన్స్‌కు, వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే అది పెద్ద దెబ్బే అవుతుంది. ఏది ఏమైనా రాత్రి 9 గంటల తర్వాత ఆకాశం క్లియర్ అయ్యే ఛాన్స్ ఉండటంతో పూర్తి మ్యాచ్ చూసే అవకాశం కూడా లేకపోలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి