Ind Vs Pak : పాకిస్థాన్ మైండ్ గేమ్.. ఫైనల్‌లో ఇండియా తగిలితే ఏం చేస్తారు? కెప్టెన్ సమాధానంతో ఐసీసీ షాక్

Ind Vs Pak : పాకిస్థాన్ మైండ్ గేమ్.. ఫైనల్‌లో ఇండియా తగిలితే ఏం చేస్తారు? కెప్టెన్ సమాధానంతో ఐసీసీ షాక్


Ind Vs Pak : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నెలకొన్న బాయ్ కాట్ వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను ఆడబోమని పాకిస్థాన్ తెగేసి చెప్పడంతో ఐసీసీ డైలమాలో పడింది. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడ లేదు.. ఒకవేళ సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఎట్టకేలకు స్పందించారు. గురువారం జరిగిన కెప్టెన్ల మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. “లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నారు సరే, మరి ఒకవేళ సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో భారత్‌తో తలపడాల్సి వస్తే పాక్ వైఖరి ఏంటి?” అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆఘా స్పందిస్తూ.. “భారత్‌తో ఆడటం అనేది మా ఆటగాళ్ల చేతుల్లో లేదు. ఇది పూర్తిగా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఒకవేళ నాకౌట్ దశలో (సెమీస్/ఫైనల్) భారత్ ఎదురైతే, అప్పుడు కూడా మేము మా ప్రభుత్వం నుంచి సలహా తీసుకుంటాం. వారు ఆడమంటే ఆడతాం, లేదంటే లేదు” అని స్పష్టం చేశారు. అంటే నాకౌట్ మ్యాచుల విషయంలో కూడా పాక్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.

అసలు ఈ గొడవంతా బంగ్లాదేశ్ జట్టుతో మొదలైంది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ చేర్చింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్థాన్. అందుకే భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఐసీసీ మాత్రం ఈ మొండి వైఖరిపై గుర్రుగా ఉంది. కేవలం ఒకే దేశంతో ఆడనని చెప్పడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని, దీనివల్ల పాక్ భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పాకిస్థాన్ బహిష్కరణ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. “మమ్మల్ని అడిగితే మేం ఆడటానికి ఎప్పుడూ సిద్ధమే. భారత్ ఎప్పుడూ నో చెప్పలేదు, నిరాకరించింది పాకిస్థానే. మా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12న మ్యాచ్ ముగిశాక, మేం నేరుగా కొలంబోకు ప్రయాణమవుతాం. ఐసీసీ నిర్ణయించిన వేదికపై మేం ఉండబోతున్నాం” అని సూర్య స్పష్టం చేశారు. దీనిని బట్టి భారత్ మ్యాచుకు పూర్తి సిద్ధంగా ఉందని, పాక్ రాకపోతే ఆ పాయింట్లు భారత్ ఖాతాలోకి వెళ్తాయని తేలిపోయింది.

భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తారు. ఈ మ్యాచ్ జరగకపోతే కేవలం అభిమానులకే కాదు, ఐసీసీకి కూడా వందల కోట్ల ఆదాయం గండి పడుతుంది. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాటలు చూస్తుంటే, వారు కేవలం రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఫిబ్రవరి 15 నాటికి పాక్ తన పట్టు విడుస్తుందా లేక పాయింట్లు, కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుంటుందా అనేది చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *