ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి యూఏఈలో ప్రారంభమవుతుంది. బీసీసీఐ నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమైనప్పటికీ.. ఈ లీగ్‌లోని హై-వోల్టేజ్ యుద్ధం సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి టీమిండియా సెప్టెంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళుతుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్థాన్‌తో తలపడుతుంది. కానీ ఈ టోర్నమెంట్‌లో టీమిండియా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతుందా అనేది పెద్ద ప్రశ్న?
భారత్-పాక్ మ్యాచ్ రద్దు ?
పహల్గామ్ ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పాక్‌తో భారత్ అన్ని సంబంధాలను తెంచుకుంది. ఇదే సమయంలో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్, టీమిండియా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని కోరుకుంటున్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. భారత జట్టు ఆటగాళ్లు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటానికి నిరాకరించారు. టోర్నమెంట్ నుండి తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. అందుకే, భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆసియా కప్‌లో కూడా జరుగుతుందా..? లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి.
ఇంతలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ రెండు జట్ల మధ్య మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని తెలిపాడు. అయితే దీనిపై ఇప్పుడే ఎటువంటి హామీ ఇవ్వలేమని చెబుతున్నారు. కానీ ఆసియా కప్‌ను WCL వంటి ప్రైవేట్ ఈవెంట్‌తో పోల్చడం సరైనది కాదని చెప్పారు. ఆసియా కప్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. ప్రభుత్వ అనుమతి ముందుగానే తీసుకుంటారని.. మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
8 జట్ల మధ్య పోటాపోటీ..
ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈసారి ఎనిమిది జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. భారత్ , పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌లు గ్రూప్ Aలో ఉన్నాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. రెండు జట్లు సూపర్ ఫోర్, ఫైనల్‌కు చేరుకుంటే.. భారత్ – పాకిస్తాన్ మూడుసార్లు ఒకదానితో ఒకటి తలపడవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..