Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ జైలులో ఎదుర్కొంటున్న పరిస్థితులపై అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా 14 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు పాక్ ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆయనకు మానవీయ కోణంలో చికిత్స అందించాలని, తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని వారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేశారు.
గత రెండేళ్లుగా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనకర వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు 85 శాతం వరకు తగ్గిపోయిందని, కేవలం 15 శాతం మాత్రమే చూపు ఉందని నివేదికలు చెబుతున్నాయి. సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్, “ఆయన పట్ల జరుగుతున్న తీరు చాలా బాధాకరం. మేమిద్దరం కేవలం ప్రత్యర్థులమే కాదు, మంచి స్నేహితులం కూడా” అని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలో కెప్టెన్ల ప్రధాన డిమాండ్లు
ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ రూపొందించిన ఈ వినతి పత్రంపై కపిల్ దేవ్, గవాస్కర్‌తో పాటు స్టీవ్ వా, అలెన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్, మైకేల్ అథర్టన్ వంటి హేమాహేమీలు సంతకాలు చేశారు. వారి ప్రధాన డిమాండ్లు ఇవే..
అత్యుత్తమ వైద్యం: ఇమ్రాన్ కోరుకున్న నిపుణుల ద్వారా ఆయనకు తక్షణమే చికిత్స అందించాలి.
మానవీయ పరిస్థితులు: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జైలులో కనీస సౌకర్యాలు కల్పించాలి.
కుటుంబ సభ్యుల సందర్శన: ఆయన కుటుంబ సభ్యులను, పిల్లలను కలిసేందుకు అనుమతించాలి.
పారదర్శక న్యాయ ప్రక్రియ: ఎటువంటి జాప్యం లేకుండా చట్టపరమైన ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించాలి.
భారత్-పాక్ మధ్య మైదానంలో ఎంతటి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ క్రీడారంగానికి అందించిన సేవలను ప్రపంచం గౌరవిస్తుంది. “స్టంప్స్ తీసిన తర్వాత వైరం ముగిసిపోతుంది, కానీ గౌరవం మాత్రం నిలిచి ఉంటుంది” అని కెప్టెన్లు తమ లేఖలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, ఒక దేశానికి ప్రధానిగా చేసిన వ్యక్తికి , గ్లోబల్ స్పోర్టింగ్ ఐకాన్‌కు దక్కాల్సిన గౌరవం ఆయనకు దక్కాలని వారు కోరుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..