
మరికొద్ది సమయంలో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక బృందాలు అప్రమత్తమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గురువారం హైదరాబాద్‌తో పాటు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వరుణుడు గర్జించాడు. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనుండటంతో శుక్రవారం, శనివారం రోజుల్లో కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ఇవే మేఘాల ప్రభావంతో దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రివరకు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.. దీని ప్రభావంతో ఆగస్టు 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందట.