
ప్రపంచంలోని అగ్రగామి సంస్థలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖుల్లో ఇద్దరు.. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, త్వరలో ప్రోక్టర్ అండ్ గాంబిల్ (P&G)కు కొత్త CEOగా బాధ్యతలు చేపట్టనున్న శైలేష్ జేజురీకర్. ఈ ఇద్దరికీ విద్యా ప్రస్థానం ప్రారంభమైన చోటు బేగంపేట్‌లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS). అదే పాఠశాలలో విద్యనభ్యసించిన మరో ప్రముఖుడు, ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సి.వి. ఆనంద్. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆనంద్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఆయన శైలేష్, సత్య నాదెళ్లలతో ఉన్న క్లాస్‌రూమ్ స్నేహాన్ని, క్రికెట్ పట్ల ముగ్గురికీ ఉన్న మమకారాన్ని గుర్తు చేసుకున్నారు. పాఠశాల రోజుల్లోనే వారిలోని నాయకత్వ లక్షణాలు కనిపించాయంటూ తెలిపారు.
187 ఏళ్ల చరిత్ర కలిగిన P&Gకు తొలి భారతీయ CEOగా శైలేష్ నియమితులవడం విశేషమే కాక, తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఇక సత్య నాదెళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్ ప్రపంచంలో భారతీయ ప్రతిభను అంతర్జాతీయ వేదికపై నిలిపిన గొప్ప పేరు. ఈ ముగ్గురూ ఒకే స్కూల్‌కి చెందుతూ, తమ తమ రంగాల్లో అగ్రస్థానాలకు చేరుకోవడం.. ఒకే స్థలంలో నాటిన విద్యా విత్తనాలు ఎలా విస్తరించాయో చూపించే అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన చాలామంది విద్యార్థులు.. వివిధ రంగాల్లో దేశవిదేశాల్లో సత్తా చాటుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.