
నమ్మకంగా పనిచేయాల్సిన సేల్స్ ఎగ్జిక్యూటివే యజమాని కళ్లుగప్పి కోట్లాది రూపాయల బంగారాన్ని దోచుకున్నాడు. అయితే అతడి తెలివితేటలు పోలీసుల ముందు పనిచేయలేదు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఏపీలోని తాడేపల్లిలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి.. రూ.1.6 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని జోయాలుక్కాస్ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు సినిమా ఫక్కీలో ఛేదించారు. ఫిబ్రవరి 14న రాత్రి 9 గంటల సమయంలో షోరూమ్‌లోని స్టాక్ సరిచూసుకోగా.. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లు మాయమైనట్లు షోరూమ్ మేనేజర్ జిన్స్ సెబాస్టియన్ గుర్తించారు. దీనిపై ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
బూట్లు, లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు
పోలీసులు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కె.గోపాలకృష్ణ శనివారం సాయంత్రం 4:50 గంటల సమయంలో అత్యంత చాకచక్యంగా 10 బంగారు బిస్కెట్లను తన బూట్లు, లోదుస్తుల్లో దాచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే తన బైక్‌పై దుకాణం నుండి పరారయ్యాడు.
తాడేపల్లిలో ట్యాప్ చేసిన పోలీసులు
ఈ కేసును సవాలుగా తీసుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీ కృష్ణ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి మొబైల్ ఫోన్ డేటా విశ్లేషణ, సీసీటీవీల ఆధారంగా అతడు ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రే తాడేపల్లిలోని నిందితుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 1.6 కోట్ల విలువైన మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన బైక్, స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన రోజే నిందితుడిని పట్టుకుని, సొత్తు మొత్తం రికవరీ చేసిన దర్యాప్తు బృందాన్ని సీనియర్ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.