హైదరాబాద్, ఆగస్టు 8: హైదరాబాద్ జంట నగరాల్లో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. రాత్రి 10 గంటలలోపు 11.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చార్మినార్ వద్ద 10.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. గురువారం రాత్రి కూడా ఇదే మాదిరి నగరంలో వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినా.. రాత్రికి మాత్రం ఆకాశానికి చిల్లు పడిందేమోనన్న సందేహం కలిగేలా భీభత్సం సృష్టించింది.
ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్, హయత్ నగర్, అంబర్ పేట్, ముషీరాబాద్, బహదూర్ పుర, సికింద్రాబాద్, బండ్లగూడ, సైదాబాద్, ఉప్పల్, అల్వాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షం కారణంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, మియాపూర్, బేగంపేట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, మెహదీపట్నంలోని ప్రధాన రహదారులు మోకాళ్లలోతు వర్షపు నీటితో నిండిపోయాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడంతో ప్రయాణికుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భారీ వర్షం ధాటికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పెద్ద అంబర్‌పేట్ మొదలు నగరంలోని దాదాపు అన్ని రోడ్లపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. రోడ్లపై నీటి నిల్వ ఉండటంతో నెమ్మదిగా వాహనాలు కదిలాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఏపీలో నేటి వాతావరణం ఇలా..
ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దానికి ఒకరోజు ముందు అదే ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురవనున్నాయి. ఆగస్ట్ 11 నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆదివారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.