యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి ముఖ్యంగా వారి అలవాట్లు, ఆరోగ్యం దెబ్బతినడం కారణం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది రక్తనాళాలను గట్టిపరుస్తుంది. అలాగే, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల ఊబకాయం పెరిగి, గుండెపై భారం పడుతుంది. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకం రక్తనాళాలను కుంచించుకుపోయి, గుండెకు రక్త సరఫరాను తగ్గిస్తాయి.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. నియంత్రణలో లేని షుగర్ లెవల్స్, నిరంతర హైబీపీ గుండెపై తీవ్ర ఒత్తిడిని పెడతాయి. ఊబకాయం కూడా ఈ ప్రమాదాలను మరింత పెంచుతుంది. కుటుంబంలో దగ్గరి బంధువులకు చిన్న వయసులోనే గుండె జబ్బులు ఉన్నట్లయితే, జన్యుపరమైన కారణాల వల్ల మీకు కూడా ఆ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నిరంతర ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అరుదుగా, కొన్ని జన్యుపరమైన గుండె జబ్బులు లేదా కొన్ని వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా గుండెపోటుకు కారణం కావచ్చు.
ముందే ఎలా గుర్తించాలి? గుండెపోటు లక్షణాలు
గుండెపోటు లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొన్నిసార్లు తీవ్రమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే, ఈ క్రింద చెప్పిన లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
గుండెపోటుకు ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం. ఇది ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం, లేదా గుండె పట్టినట్లు ఉండటం వంటి భావనను కలిగిస్తుంది. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు, లేదా వచ్చి వచ్చి పోవచ్చు. ఛాతీ నొప్పి కాకుండా, అది భుజాలు (ముఖ్యంగా ఎడమ భుజం), చేయి, మెడ, దవడ, వీపు లేదా కడుపు పై భాగానికి కూడా పాకవచ్చు.
ఛాతీ నొప్పి ఉన్నా లేకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం రావచ్చు. ఏసీ లేదా ఫ్యాన్ ఉన్నా కూడా విపరీతమైన చల్లని చెమటలు పట్టడం ఒక ముఖ్యమైన లక్షణం. వికారం, వాంతులు లేదా కడుపులో అజీర్తిగా అనిపించడం, తలతిరగడం లేదా స్పృహ తప్పడం, అకస్మాత్తుగా తీవ్రమైన అలసట, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించడం (గుండె దడ) వంటివి కూడా గుండెపోటు లక్షణాలు కావచ్చు.
ఈ లక్షణాలు కొత్తగా ఉండి, విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండెపోటు సమయంలో ప్రతీ నిమిషం విలువైనది. సరైన సమయంలో చికిత్స ప్రాణాలను కాపాడుతుంది.