
శరీరంలో విటమిన్ డి తగినంత లేకపోతే అలసట, మూడ్ స్వింగ్స్, కండరాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం భారతదేశంలో, ముఖ్యంగా మహిళలు, పట్టణ ప్రాంతాల వారిలో ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామందికి లోపం ఉన్నట్లు తెలియదు. విటమిన్ డి ఎముకల బలం, కాల్షియం శోషణ, మానసిక స్థితిని నియంత్రించడం, కండరాల పనితీరు, రోగనిరోధక శక్తికి కీలకం. సూర్యరశ్మి దీనికి ప్రధాన సహజ వనరు. కానీ, ఆధునిక జీవనశైలి, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం దీని ఉత్పత్తిని అడ్డుకుంటాయి.
విటమిన్ డి లోపం సూచనలు: దీర్ఘకాలిక అలసట, నీరసం, కండరాల బలహీనత, జుట్టు పలచబడటం, తరచుగా అంటువ్యాధులు, మతిమరుపు, ఎముకల నొప్పి ప్రధాన లక్షణాలు. సూర్యరశ్మి తక్కువగా తగలడం, కాలుష్యం, ముదురు రంగు చర్మం, సరైన ఆహారం లేకపోవడం, సన్‌స్క్రీన్ అధిక వినియోగం, కొన్ని ఆరోగ్య సమస్యలు లోపానికి కారణాలు.
సహజంగా లోపాన్ని అధిగమించే మార్గాలు:
సూర్యరశ్మి: ప్రతిరోజూ ఉదయం 7-10 గంటల మధ్య 15-20 నిమిషాలు సన్‌స్క్రీన్ లేకుండా సూర్యరశ్మి శరీరాన్ని తాకేలా చూసుకోవాలి. సాయంత్రం 4 గంటల ఎండ వల్ల కూడా ఈ లోపం తీరుతుంది.
ఆహారం: విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోండి. చేపలు (సాల్మన్, మాకెరెల్, సార్డిన్‌లు), గుడ్డు పచ్చసొన, బలవర్ధకమైన పాలు, పెరుగు, తృణధాన్యాలు, చీజ్, సూర్యరశ్మి తగిలిన పుట్టగొడుగులు, ఆవు పాలు లేదా సోయా పాలు, కాడ్ లివర్ ఆయిల్ (వైద్యుల సలహా మేరకు) వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
శోషణ మెరుగుపడటం: విటమిన్ డి ఉన్న ఆహారాలను ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోండి. ఒమేగా-3 వనరులను జోడించండి. ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించండి. సూర్యరశ్మి, సరైన ఆహార ఎంపికలతో విటమిన్ డి లోపాన్ని సహజంగా పరిష్కరించడం వల్ల శక్తి, మానసిక స్థితి, ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడతాయి.