అమరావతి, ఆగస్టు 4: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో తరగతికి 50 మంది విద్యార్థులకుపైగా ఉంటే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీఓ మేరకు తరగతి గదిలో విద్యార్ధుల సంఖ్య 54కి మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ జీవోకి సవరణ చేస్తూ ఆ సంఖ్యను 50కి కుదించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులకు అదనపు సెక్షన్ మంజూరు చేయనున్నారు.
ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, సర్దుబాటు, పదోన్నతులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు జీఓ ఇవ్వకుండానే ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 25 వేల మంది టీచర్లకు జీతాల సమస్య వచ్చిపడింది. దీంతో సెక్షన్లు, టీచర్ల కేటాయింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల మేరకు ఫౌండేషనల్ పాఠశాలల్లో 20 మంది వరకు విద్యార్ధులకు ఒక ఎస్జీటీ టీచర్, 21 నుంచి 60 వరకు విద్యార్ధులుంటే ఇద్దరు ఎస్జీటీ టీచర్లను నియమిస్తారు. ఇక ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 121 నుంచి 150 మధ్య విద్యార్థులు ఉంటే మిగులు అదనంగా మరో ఎస్జీటీని కేటాయిస్తారు. పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న 1221 పోస్టులను రద్దు చేసి, ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కొత్తగా 1,901 పోస్టులను సృష్టించారు. పదోన్నతులు, హేతుబద్ధీకరణ తర్వాత 1,995 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కతేలింది. ఇందులో ప్రధానోపాధ్యాయుల పోస్టులు 30, ఎస్జీటీ పోస్టులు 1,965 ఉన్నాయి. ఇంతులో ఏ జిల్లాలోనైనా కొరత ఏర్పడితే కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయ పోస్టులను అవసరమైన మేరకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.