Gobi 65 Recipe: వర్షం పడుతుండగా.. వేడి వేడి గోబీ 65 తింటే ఆ మజానే వేరు..! మీకోసమే ఈ రెసిపీ ఓసారి ట్రై చేయండి..!

Gobi 65 Recipe: వర్షం పడుతుండగా.. వేడి వేడి గోబీ 65 తింటే ఆ మజానే వేరు..! మీకోసమే ఈ రెసిపీ ఓసారి ట్రై చేయండి..!


వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా..? అలాంటి టైమ్‌లో ఇంట్లోనే ఈ స్పైసీ గోబీ 65 చేసుకోండి. క్రిస్పీ కాలీఫ్లవర్ ముక్కల్ని వేయించి.. ఘుమఘుమలాడే తాలింపుతో కలిపి తయారు చేసే ఈ రెసిపీ వర్షాకాలపు సాయంత్రాలను మరింత ఆనందంగా మారుస్తుంది. దీన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు

  • కాలీఫ్లవర్ ముక్కలు – 2½ కప్పులు
  • గోధుమ పిండి – ¼ కప్పు
  • రైస్ ఫ్లోర్ లేదా కార్న్‌స్టార్చ్ – ¼ కప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1½ టీస్పూన్లు
  • గరం మసాలా – ½ టీస్పూన్
  • మిరియాల పొడి – ¼ టీస్పూన్
  • కారం – 1 టీస్పూన్
  • కరివేపాకు – 2 రెబ్బలు (చిన్నగా కట్ చేసినవి)
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నీళ్లు – ¼ కప్పు (అవసరమైతే కొద్దిగా ఎక్కువ)
  • నూనె – 1½ కప్పులు (వేయించడానికి)

తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు

  • పచ్చిమిర్చి – 2
  • వెల్లుల్లి – 2 నుంచి 3 రెబ్బలు
  • జీలకర్ర – ½ టీస్పూన్
  • కరివేపాకు – 1 రెబ్బ
  • నూనె – 1 టేబుల్ స్పూన్
  • కారం – ½ టీస్పూన్
  • గరం మసాలా – ¼ టీస్పూన్
  • గట్టి పెరుగు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం

గోబీ 65 తయారు చేయడానికి ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు తీసుకొని కొద్దిగా వేడి చేసి స్టవ్ ఆపిన తర్వాత ముక్కలను అందులో వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆరిపోయేలా చూడాలి. ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, రైస్ ఫ్లోర్, గరం మసాలా, ఉప్పు, కారం, తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి మిశ్రమంలా కలపాలి. ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

తరువాత కాలీఫ్లవర్ ముక్కలను వేయించడానికి ఒక కడాయిలో నూనె వేడి చేయాలి. బాగా వేడయ్యాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక్కో ముక్కను జాగ్రత్తగా నూనెలో వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కదపకుండా వేయించాలి. ఆ తర్వాత కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించి తీసేయాలి. మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

చివరగా తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో కారం, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలపాలి. ఒక చిన్న పాన్‌ లో నూనె వేడి చేసి జీలకర్ర వేయించాలి. అవి చిటపటలాడటం మొదలుపెడితే వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకట్రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి అది చిక్కగా అయ్యే వరకు వేయించి.. వేయించిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే రుచికరమైన క్రిస్పీ గోబీ 65 రెడీ. దీన్ని స్నాక్‌గా లేదా అన్నం, కూరలతో కూడా తినవచ్చు. ఒకవేళ తాలింపు ఇష్టం లేకపోతే.. వేయించిన గోబీపై వేడి నూనెలో వేయించిన కరివేపాకు, పచ్చిమిర్చి వేసి గార్నిష్ చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *