అమరావతి, ఆగస్ట్ 10: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే ఈ పథకం ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో దాదాపు 74 శాతం ఈ పథకం కిందకు తీసుకురానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. ఉచిత ప్రయాణం అమలుకు ఐదు రకాల బస్సులను ఎంపిక చేశారు. ఇవి దాదాపు 8,458 బస్సులు ఉన్నాయి. ఉచిత ప్రయాణం అమలులోకి వస్తే ఈ బస్సులో మహిళా ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఒకవేళ రద్దీ పెరిగితే రద్దీకి తగినట్లుగా తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మహిళల ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం 2 రోజుల్లో జారీ చేయనుంది. ఈ ఉత్తర్వుల్లో ఏయే బస్సుల్లో ఉచిత ప్రయాణంకి అనుమతి ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని ఉపయోగించవచ్చు అనే పలు విషయాలు వెల్లడిస్తారు. ఇక సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఆగస్టు 15న ఈ పథకాన్ని మంగళగిరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆ బస్సులో ఉచిత ప్రయాణంకి నో ఛాన్స్..
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్‌స్టేట్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత ప్రయాణంకి అవకాశం ఉండదు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణంకి అనుమతి ఉండదు. వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశమిస్తే.. బస్సుల్లో రద్దీ ఎక్కువై, ఘాట్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఉండదు.
మరో ఐదు రోజుల్లోనే ఈ పథకం ప్రారంభంకావల్సి ఉండగా.. ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉంది. దీనిని భర్తీ చేసేందుకు ప్రతి డిపోలో ఏ రోజుకారోజు తాత్కాలిక డ్రైవర్లు (ఆన్‌కాల్ డ్రైవర్ల) సంఖ్యను పెంచనున్నారు. ఆయా జిల్లాల ప్రజా రవాణాశాఖ అధికారులు ఆన్‌కాల్ డ్రైవర్లను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. మరికొన్ని డిపోల పరిధిలో కండక్టర్లు సైతం తక్కువగా ఉన్నారు. వీటిల్లో ఓడీ నిర్వహిస్తున్న కండక్టర్లకు ఓడీ రద్దు చేయనున్నారు.
కొన్ని బస్టాండ్లలో నాన్‌స్టాప్ బస్సులకు టికెట్లు జారీచేసే కండక్టర్లకు బస్సుల్లో డ్యూటీలు వేయనున్నారు. కొద్దిరోజులు డబుల్ డ్యూటీలు చేయాలని డిపో మేనేజర్లు కండక్టర్లకు సూచించారు. ప్రస్తుత ప్రయాణికుల్లో 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ఉంటున్నారు. అయితే ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే పురుషుల సంఖ్య 33 శాతానికి తగ్గి, మహిళల సంఖ్య 67 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పురుష ప్రయాణికులు తగ్గితే ఆర్టీసీకి ఏడాదికి రూ.288 కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. మహిళా ప్రయాణికులకయ్యే ఛార్జీల విలువ ఏడాదికి రూ.1,453 కోట్లుగా లెక్కించారు. మొత్తంగా ఉచిత ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీపై ప్రతి నెల దాదాపు రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,942 కోట్ల భారం పడుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.