ఏపీలోని చంద్రబాబు సర్కార్.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు పథకం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆగస్టు15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నారు. గుర్తింపు కార్డుతో.. ఐదు రకాల ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ఆడపిల్లలు, మహిళలకు బస్సు ఫ్రీ.. ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది. అయితే.. తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆ ఒక్క రూట్‌లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని చెప్పారు. విశాఖలో డిపో మేనేజర్ల సమీక్ష సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో కలిసి ఆర్టిసి ఎండీ ద్వారకాతిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదన్నారు. భద్రతా కారణాల దృశ్య ఆయా రూట్లలో ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని మహిళలు గుర్తించాలని అన్నారు. అయితే.. ఏజెన్సీలో ఘాట్ రోడ్డు కాని ప్రాంతాల్లో యధావిధిగా పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు.. కానీ, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు మాత్రం పథకం వర్తించదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమలరావు అన్నారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తామన్నారు ఆర్టీసీ ఎండి. ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లా నుంచి ఎక్కడికైనా.. ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్టుగా బస్సులను సిద్ధం చేశామన్నారు.
త్వరలో పల్లె వెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు.. ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పుకొచ్చారు. రోజూ 89 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ లేదా గుర్తింపు కార్డు కచ్చితంగా చూపించాలని సూచించారు. భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు ఆర్టీసీ ఎండీ.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని.. స్త్రీ శక్తి పథకం వల్ల ఈ సంఖ్య 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం అమల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయని.. భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విజయవంతంగా స్త్రీ శక్తి పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. సవాళ్లు సమస్యలను అధిగమించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఏపీకి 1050 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని.. తొలి విడతగా ఆరు నెలల్లోగా 700 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ చైర్మన్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..