Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. యువతకు గుణశేఖర్ ఇచ్చిన సందేశం..!

Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. యువతకు గుణశేఖర్ ఇచ్చిన సందేశం..!


Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. యువతకు గుణశేఖర్ ఇచ్చిన సందేశం..!

మూవీ రివ్యూ: యుఫోరియా

నటీనటులు: భూమిక చావ్లా, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, నాజర్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.

సంగీతం: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్ పోతన్

నిర్మాతలు: నీలిమ గుణ, రాగిణి గుణ, యుక్తాముఖి

దర్శకత్వం: గుణశేఖర్

ఒకప్పుడు భారీ సెట్టింగులు, బ్లాక్‌బస్టర్ విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్.. ఈసారి రూట్ మార్చి సామాజిక బాధ్యతతో కూడిన కథను ఎంచుకున్నారు. యువతను ప్రధానంగా టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘యుఫోరియా’. మరి గుణశేఖర్ మార్క్ ఈ సినిమాలో కనిపించిందా? ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.

కథ:

చైత్ర (సారా అర్జున్) ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి. చదువులో టాపర్, ఐఏఎస్ సాధించాలన్నదే ఆమె ఏకైక లక్ష్యం. ఒకరోజు స్నేహితురాలి బలవంతం మీద పబ్ పార్టీకి వెళ్తుంది. అక్కడ వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి) గ్యాంగ్ పరిచయం అవుతుంది. చైత్రను చూసి మోహించిన వికాస్, ఆమెను ట్రాప్ చేస్తాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని నమ్మించి, కారులో తీసుకెళ్లి డ్రగ్స్ మత్తులో తన స్నేహితులతో కలిసి ఆమెపై దారుణానికి ఒడిగడతాడు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సిటీ పోలీస్ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఎలా ఛేదించారు? నిందితులు బడా బాబుల పిల్లలు కావడంతో ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి? అసలు వింధ్య వేములపల్లి (భూమిక) కోర్టు మెట్లెక్కి “నేను నేరం చేశాను.. నాకు శిక్ష వేయండి” అని ఎందుకు అడిగింది? ‘ఆపరేషన్ యుఫోరియా’ ద్వారా కమిషనర్ సాధించిందేమిటి? అనేదే మిగతా కథ.

కథనం:

డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును ఎలా చిదిమేస్తోంది, ఆ మత్తులో వారు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తున్నారు అనే పాయింట్‌ను గుణశేఖర్ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు వంటి వాస్తవ ఘటనల ఆధారంగా కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దర్శకుడు కథను దాచి పెట్టకుండా ట్రైలర్‌లోనే అసలు విషయం చెప్పేశారు. అయితే దాన్ని తెరపై ఎంత ఆసక్తికరంగా మలిచారనేదే ఇక్కడ కీలకం. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, నేరం జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా సాక్ష్యాల సేకరణ, పోక్సో చట్టం తీవ్రతను చూపించిన తీరు బాగుంది. కానీ, సినిమాటిక్ డ్రామా కంటే ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలగడం కాస్త మైనస్.

సెకండాఫ్‌లో జైలు జీవితం, భూమిక పాత్ర తాలూకు సంఘర్షణ ప్రధానంగా సాగుతాయి. తప్పు చేసిన కొడుకును సంస్కరించాలని తపించే తల్లిగా భూమిక పాత్రలో వైవిధ్యం ఉంది కానీ, ఆ జర్నీని తెరపై కన్విన్సింగ్‌గా చూపించడంలో దర్శకుడు తడబడ్డారు. క్లైమాక్స్ మాత్రం ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఊహించదగిన కథనం, డాక్యుమెంటరీ తరహా నెరేషన్, సెకండాఫ్‌లో నెమ్మదించిన స్క్రీన్ ప్లే దీనికి మైనస్ అయ్యాయి. యుఫోరియా ఒక సామాజిక బాధ్యతతో తీసిన చిత్రం. డ్రగ్స్ కల్చర్ పట్ల యువతను, తల్లిదండ్రులను అప్రమత్తం చేసే ప్రయత్నం. కమర్షియల్ హంగులు ఆశించకుండా, ఒక మంచి సందేశం కోసం సినిమా చూడాలనుకునే వారికి ఇది నచ్చుతుంది.

నటీనటులు:

సారా అర్జున్ మరోసారి ఆకట్టుకుంది. బాధితురాలిగా ఆమె నటన హృదయాలను కదిలిస్తుంది. అమాయకత్వం, ఆవేదనను కళ్ళతోనే పలికించింది. భూమిక సినిమాకు ఆత్మ. తప్పు చేసిన కొడుకును శిక్షించాలనే తల్లిగా, సమాజం నుంచి వచ్చే నిందలను భరించే మహిళగా అద్భుతమైన నటన కనబరిచింది. గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్‌గా చాలా హుందాగా, స్టైలిష్‌గా కనిపించారు. విఘ్నేష్ డ్రగ్స్ బానిసగా, జైలు శిక్ష అనుభవించే ఖైదీగా రెండు వేరియేషన్స్‌లోనూ బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ టీం:

కాల భైరవ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. గుణశేఖర్ ఎంచుకున్న సామాజిక అంశం మంచిదే అయినా, కథనంలో ఇంకాస్త వేగం, ఎమోషనల్ కనెక్ట్ ఉంటే సినిమా స్థాయి పెరిగేది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా యుఫోరియా.. సందేశం ఉంది.. కానీ కండీషన్స్ అప్లై..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *