ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. బుమ్రా ఔట్! జట్టులోకి ఎవరు రానున్నారంటే?

ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. బుమ్రా ఔట్! జట్టులోకి ఎవరు రానున్నారంటే?


భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో టెస్టులు ఆడుతోంది. అయితే లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఆధిపత్యం వహించినప్పటికీ ఆఖరి రోజు పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఆతిథ్య జట్టు చేతిలో గిల్ సేన చిత్తుగా ఓడింది. భారత బౌలర్ల వైఫ్యలానికి తోడు కీలకమైన సమయాల్లో టీమ్ ఇండియాలోని కొంతమంది ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడిచారు. దీంతో టీమిండియా బ్యాటర్లు 5 సెంచరీలు చేసిన తర్వాత కూడా భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. దీని కారణంగా, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 0-1తో వెనుకబడి ఉంది. ఇప్పుడు టీమ్ ఇండియా రెండవ మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకోవాలనుకుంటోంది. తొలి మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. అయితే, బుమ్రాకు ఇతర తోటి బౌలర్ల నుండి మంచి మద్దతు లభించలేదు. ఈ సిరీస్‌కు ముందు బుమ్రా 5 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. బుమ్రా ఏ 3 మ్యాచ్‌ల్లో ఆడతాడనేది పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని కోచ్ గంభీర్ తెలిపాడు. దీని ప్రకారం, బుమ్రా రెండవ మ్యాచ్‌లో ఆడరని చెబుతున్నారు. అందువల్ల, రెండవ టెస్ట్‌లో బుమ్రా స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్న తలెత్తుతోంది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ప్రధాన కోచ్ గంభీర్ ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.

బుమ్రా స్థానంలో ఇద్దరు బౌలర్ల పేర్లు చర్చకు వస్తున్నాయి. బుమ్రా స్థానంలో ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ లో ఎవరో ఒకరు తుది జట్టులోకి రావొచ్చని తెలుస్తోంది. ఆకాష్ దీప్ ఇప్పటికే టెస్టుల్లో ఆడాడు. అయితే అర్ష్‌దీప్ కు మాత్రం టెస్టులో ఇంకా అనుభవం లేదు. కాబట్టి గిల్-గంభీర్ జంట ఎవరిని ఎంచుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం జూలై 2న మాత్రమే తేలనుంది. ఆకాష్ దీప్ కు 7 టెస్ట్ మ్యాచ్ ల అనుభవం ఉంది. గత సంవత్సరం భారతదేశంలో పర్యటించిన ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆకాష్ అరంగేట్రం చేశాడు. గాయపడటానికి ముందు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఆకాష్ దీప్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాష్ కు ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం కూడా ఉంది. ఆకాష్ 7 టెస్ట్ మ్యాచ్ లలో 38 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 128 వికెట్ల రికార్డు కూడా ఆకాష్ పేరిట ఉంది.

మరోవైపు, అర్ష్‌దీప్ సింగ్ ఎడమచేతి వాటం బౌలర్. మొదటి టెస్టులో అందరూ కుడిచేతి బౌలర్లే ఆడారు. అలాగే, అర్ష్‌దీప్‌కు ఇంగ్లాండ్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి, గిల్-గంభీర్ ఆకాష్, అర్ష్‌దీప్‌లలో ఎవరిని తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *