ఒడిశా దండకారణ్యంలో మరోసారి ఎన్‌కౌంటర్ కలకలం రేపింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందినట్టుగా తెలిసింది. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం రోజున జరిగిందని తెలిసింది. ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖాలద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడ్డారు. తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పును ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు చందన్, మంకుగా గుర్తించారు.
ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నాయి. భద్రతా సిబ్బంది దట్టమైన అడవిని జల్లెడపడుతున్నారు. మృతిచెందిన మావోయిస్టులు గతంలో హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నారని చెబుతున్నారు. మావోయిస్టుల నిర్మూలన ఈ ప్రాంతంలో తీవ్రవాద ప్రభావాన్ని అరికట్టే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
ఆపరేషన్‌ను ఖచ్చితత్వంతో, ధైర్యంగా నిర్వహించినందుకు ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ ఖురానియా ఎస్పీ హరీష్ బిసి, డివిఎఫ్ బృందాన్ని అభినందించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వివరాల కోసం క్లిక్ చేయండి..