ప్రభుత్వం గ్రీన్ ఇంధన విధానాన్ని విస్తరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఇథనాల్-మిశ్రమ పెట్రోల్ వాడకం వేగంగా పెరగడం ప్రారంభమైంది. ప్రభుత్వ గ్రీన్ ఫ్యూయల్ పాలసీని, రోడ్లపై E20 ఇంధనంతో నడిచే వాహనాల లక్ష్యాన్ని నెరవేర్చడానికి కంపెనీలు పెద్ద అడుగు వేసినప్పటికీ.. ప్రజలు E20 ఇంధనంపై ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఇథనాల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. E20 పెట్రోల్‌ను 20 శాతం ఇథనాల్‌తో కలిపితే మైలేజ్‌లో భారీ తగ్గుదల ఉంటుందని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా ఇథనాల్ మిశ్రమ ఇంధనం వాహనాల ఇంధన ట్యాంక్, ఇంజిన్‌కు నష్టం కలిగిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం రియాక్షన్
ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. అటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదని తెలిపింది. ఇంధన సామర్థ్యంపై ఈ20 ప్రభావం చాలా తక్కువ స్పష్టం చేసింది. మైలేజ్ 1 నుండి 2 శాతం తగ్గవచ్చని తెలియజేసింది. మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్ మరియు E20 అనుకూల భాగాలను ఉపయోగించడం ద్వారా ఈ తగ్గుదలను తగ్గించవచ్చు
E20 తక్కువ మైలేజీ
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E20 అంటే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ తక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది. అందుకే మైలేజీలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తుంది. E20, E10 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడిన వాహనాలు 1-2 శాతం తక్కువ మైలేజీని ఇస్తాయి. అయితే ఇంజిన్ ట్యూనింగ్ సహాయంతో ఈ స్వల్ప తగ్గుదలను తగ్గించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
E20 లక్ష్యాన్ని గడువుకు ముందే..
భారత్ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన సమయం కంటే ఐదేళ్ల ముందుగానే సాధించిందని ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ తయారీదారుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది.
E20 హాని కలిగించదు..?
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల ప్రకారం.. E20 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలు ఏప్రిల్ 2023 నుండి దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలు ఎటువంటి నష్టం లేకుండా ఇథనాల్ మిశ్రమాలను నిర్వహించడానికి అప్‌గ్రేడ్ చేసిన ఇంధన వ్యవస్థలతో వస్తాయి. E20 అనుకూల వాహనాలను విక్రయించే సుజుకి, రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్ మోటార్, హోండా వంటి అనేక పెద్ద కంపెనీలు ఉన్నాయి.
ఇథనాల్ పర్యావరణ అనుకూలమైనదా?
ఇథనాల్ ఒక పునరుత్పాదక ఇంధనం. నీతి ఆయోగ్ అధ్యయనంలో చెరకు నుండి తయారైన ఇథనాల్ పెట్రోల్‌తో పోలిస్తే 65 శాతం తక్కువ CO₂ విడుదల చేస్తుందని తేలింది. అయితే మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉద్గారాలను దాదాపు 50 శాతం తగ్గిస్తుంది. అందుకే ఇథనాల్ మిశ్రమం దేశ వాతావరణ కార్యాచరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.
ఇథనాల్‌పై ప్రభుత్వ వైఖరి
E20 విజయవంతం అయిన తర్వాత, ప్రభుత్వం ఇప్పుడు E27ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ఖరారుఅయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా E27 కోసం ఇంజిన్ మార్పులను మూల్యాంకనం చేస్తోంది. ప్రభుత్వం ఇథనాల్‌ను ఒక ముఖ్యమైన ఇంధన వనరుగా చూస్తోంది. దాని వినియోగాన్ని ప్రోత్సహించడానికి సాధ్యమైన ప్రతి చర్యను తీసుకుంటోంది. ఇథనాల్ వైపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్య పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా ముడి చమురు దిగుమతులను కూడా తగ్గిస్తుంది. తద్వారా భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు చెరకు, మొక్కజొన్న వంటి పంటలు ఇథనాల్ ఉత్పత్తికి అవసరం. ప్రభుత్వ ఈ చర్య రైతుల ఆదాయాన్ని పెంచుతుంది.
వేగవంతమైన వృద్ధి
ఇథనాల్ ఉత్పత్తి 2014లో 38 కోట్ల లీటర్ల నుండి జూన్ 2025 నాటికి 661 కోట్ల లీటర్లకు పెరిగింది. దీని కారణంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 698 లక్షల టన్నులు తగ్గాయి.