హైదరాబాద్‌కు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు వ్యాపారం, ఉపాధి, విద్య వంటి కారణాలతో వస్తూ ఉంటారు. ఇక్కడే ఏళ్ల పాటు ఉండటంతో పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇలాంటివారు చాలామంది తమ డ్రైవింగ్ లైసెన్స్‌లలో పాత అడ్రస్‌నే ఉంచుకుంటున్నారు. సంవత్సరాలుగా దానిని మార్చుకోవడం లేదు.
అడ్రస్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అధికారిక ధృవీకరణ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఇలాంటి వారందరూ తమ అడ్రస్‌ను మార్చుకోవాలని రీజినల్ రవాణా అథారిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అడ్రస్ అప్డేట్ చేసుకోవడం వల్ల ఓ గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపింది.
ఇక డ్రైవింగ్ లెసెన్స్లో అడ్రస్ మార్చుకోవడం వల్ల సేవలు కూడా మరింత వేగంగా పొందేందుకు సహాయపడుతుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా పేపర్ లెస్ సేవలను రవాణాశాఖ ప్రారంభించింది. దీని ద్వారా ఆర్టీఏ ఆఫీసులను విజిట్ చేయాల్సిన అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వ పరివాహన పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లోని అడ్రస్‌ను మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మకాం మార్చినవారు సింపుల్‌గా ఆ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నాక కొత్త డ్రైవింగ్ లైసెన్స్ అప్డేడెట్ అడ్రస్‌తో మీ ఇంటికి వస్తుంది.
దరఖాస్తు సమర్పించేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను అందించాలి. 40 ఏళ్లు పైబడినవారు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అందరూ తప్పనిసరిగా ఈ సూచనల పాటించాలని రవాణశాఖ అధికారులు పేర్కొన్నారు.




