కొందరికి మామూలుగా కుక్కలంటే చాలా భయం ఉంటుంది. దానికి తోడు అవి కరవడానికి వస్తున్నాయంటే ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. అది రాత్రి, పగలు తేడా అనేదే లేకుండా ఈ సమస్య చాలా ప్రాంతాల్లో ఉంటుంది. వినడానికి ఇది చిన్న సమస్య లాగే కనిపిస్తున్నా.. దాని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. కుక్క కాటుకు గురైతే ఆస్పత్రుల పాలవడం, గాయాలపాలై ఇబ్బందులు పడడం జరిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద నగరాలతో పాటు పల్లెల్లోనూ అధికంగానే ఉంది. ఇటీవలి కాలంలో కుక్క కాటుకు గురై గాయాలపాలైన చిన్నారుల కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఒక సంఘటనే తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని ఠాణే జిల్లా ఉల్హాస్‌నగర్‌లో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ విద్యార్థినిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ధైర్యంతో చొరవ తీసుకుని ఆ చిన్నారికి రక్షణగా నిలవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో చూస్తుంటే మనకు కూడా భయంతో ఒంట్లో వణుకు పుట్టకుండా ఉండదు. ఎందుకంటే, ఒకేసారిగా నాలుగైదు కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడం, రెప్పపాటులో ఆ ప్రమాదం బారి నుంచి తప్పించుకోవడం జరిగిపోయాయి.
ఉల్హాస్‌నగర్-5 ప్రాంతంలోని మటన్, చేపల మార్కెట్ వద్ద నానక్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడికి పాల్పడింది. ఆ విద్యార్థిని భయంతో వణికిపోయి పరుగులు పెడుతూ ఆర్తనాదాలు చేయడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి చేతిలో ఉన్న కర్రతో కుక్కలను తరిమికొట్టాడు. ఆ వ్యక్తి తీసుకున్న చొరవతో పెద్ద ప్రమాదమే తప్పింది కానీ, లేదంటే ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉండేదో అస్సలు ఊహించలేం. స్థానికులు స్పందించి కుక్కలను అక్కడి నుంచి తరిమికొట్టడంతో ఆ విద్యార్థినికి పెద్దగా గాయాలేవీ కాలేదు. ఆ ప్రాంతంలో గత కొంతకాలంగా వీధి కుక్కల బెడద అధికంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు సమస్యను పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పిల్లలు స్కూల్‌కి వచ్చిపోతుంటారని.. తమ పిల్లలను ఒంటరిగా బయటికి పంపాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో కుక్కలు గుంపుగా తిరుగుతుండడంతో పెద్దవాళ్లు కూడా ఏదైనా పనుల నిమిత్తం వెళ్లాలంటే వీధి కుక్కలు దాడులకు దిగుతున్నాయని అంటున్నారు. ఇక తమ పరిస్థితే అలా ఉంటే చిన్నపిల్లల సంగతి దేవుడెరుగు అని వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి తలెత్తుతోందని అంటున్నారు. తాజాగా జరిగిన సంఘటనలో కూడా స్థానిక వ్యక్తులు స్పందించి చిన్నారిని రక్షించడంతో సరిపోయిందని, ఇలాంటి భయంకర ఘటనలు చూసైనా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉల్హాస్‌నగర్ మహానగరపాలికను డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..