చిన్నగా మిగిలిన సబ్బును చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కాటన్ బట్టలో చుట్టి బట్టల అలమారిలో ఉంచండి. ఈ చిన్న చిట్కాతో మీ బట్టలకు ఎప్పుడూ మంచి వాసన వస్తుంది. ముఖ్యంగా తేమ వల్ల వచ్చే చెడు వాసనను ఇది తగ్గిస్తుంది. వేసవి కాలంలో ఇది చాలా బాగా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ఫ్రెష్‌నర్ లు కొనాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.
వేసవిలో ఎక్కువ కాలం వేయబడే బూట్లు చెడు వాసనను వెదజల్లుతుంటాయి. ముందురోజు శుభ్రం చేసినా కూడా మరుసటి రోజు మళ్లీ అలాంటి వాసన వస్తే అది తేమ కారణంగా ఉండవచ్చు. అలాంటి సందర్భంలో ఒక చిన్న సబ్బు ముక్కను రాత్రి సమయంలో బూట్లో ఉంచండి. సబ్బు ఆ తేమను పీల్చుకొని బూట్లను ఫ్రెష్ గా ఉంచుతుంది. ఉదయం వాటిని వేసుకున్నప్పుడు చెడు వాసన లేని కొత్త అనుభూతి కలుగుతుంది.
మీ బాత్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతున్నా.. కొన్నిసార్లు నిరాశ కలిగించే వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిన సబ్బును చిన్న మెష్ బ్యాగ్ లో వేసి బాత్ రూమ్ మూలలో ఉంచండి. ఈ బ్యాగ్ ను వాష్ బేసిన్ పక్కన లేదా కమోడ్ వెనుక ఉంచితే మంచిది. ఆ సబ్బు నీటి ఆవిరితో తడిగా మారి సుగంధాన్ని విడుదల చేస్తుంది. దీని వలన బాత్ రూమ్ ఎప్పుడూ తాజా వాసనతో ఉంటుంది.
మీరు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో రూమ్ ఫ్రెషనర్ తయారు చేయాలనుకుంటే మిగిలిన సబ్బు ముక్కలను ఉపయోగించండి. ముందుగా వాటిని తురిమి ఒక గిన్నెలో 2 కప్పుల వేడి నీటిలో కలపండి. సబ్బు పూర్తిగా కరిగేవరకు తక్కువ మంట మీద మెల్లగా కలుపుతూ ఉండండి. ద్రావణం పల్చగా మారిన తర్వాత మంట ఆపి దానిని చల్లారనివ్వండి.
ఇప్పుడు దానిని వడకట్టి స్ప్రే బాటిల్ లో నింపండి. చివరగా కొన్ని చుక్కల సహజ ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే సువాసన మరింత బాగుంటుంది. ఇది ఒక సహజ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. ఇకపై మిగిలిన సబ్బు ముక్కలు కనబడితే వాటిని పారేయకండి.. ఉపయోగించి ప్రయోజనం పొందండి.