ఒక్కడు. ఎస్ ఒకే ఒక్కడు. పాపభీతితో నోరువిప్పాడు. ప్రాణభయంతోనే ఆ పనిచేశానంటున్నాడు. లెక్కలేనన్ని శవాలను అతనే పూడ్చేశాడు. అనాథశవాలు కాదు. రాబందుల్లాంటి మనుషులు రాక్షసంగా పీక్కుతిన్న శవాలు. స్కూలుకెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు.. ఇలా వందలమంది శవాలు. ఒంటిమీద నూలుపోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాలకోసం అన్వేషణ మొదలైంది. నా చేతులతోనే వందలశవాలను ధర్మస్థలలో చాలాచోట్ల పూడ్చేశానంటూ వాంగ్మూలమిచ్చాడో వ్యక్తి. 1995 నుంచి 2014 డిసెంబరు వరకూ ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్నాటకని షేక్‌చేస్తోంది. సంచలనం కోసం చెప్పలేదతను. ఆధారాలు చూపిస్తానంటున్నాడు. ఎవరు చేశారో చెబుతానంటున్నాడు. ఎవరూ నమ్మరేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫొటోలు తీసి చూపించాడు. తనను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు. లైడిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు. తాను పూడ్చేసిన మృతదేహాల్లో 12నుంచి 15ఏళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు, మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్లు చెబుతున్నాడు. తీవ్ర గాయాలు, యాసిడ్‌తో కాల్చేసిన మృతదేహాలను అతను పూడ్చేవాడు. లేదంటే చంపేస్తామని పని పురమాయించినవారు బెదిరించేవారు. తమ మాట వినకుంటే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారంటున్నాడు ఆ సాక్షి.
ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా
మృతదేహాలు పూడ్చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుధ్య కార్మికుడే ఇప్పుడీ కేసులో కీలక సాక్షి. 2014లో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించటంతో కుటుంబంతో సహా రాత్రికిరాత్రి వేరేచోటికి పారిపోయాడు. పాపభీతి వెంటాడిందో ఏమో.. ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడేమో. మౌనంగా ఉండటానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటికొచ్చాడు. దిక్కులేని శవాల్లో పూడ్చేసిన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తయినా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాడు. నిందితులెంతో పలుకుబడి ఉన్నవారని, వ్యతిరేకించేవారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు. ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి, పేరు, రూపం ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు. విచారణ కోసం నలుగురు ఐపీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ ఐదుగంటలపాటు భీమాను విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాలలో అధికారయంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, జాగిలాల సాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య నాలుగురోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మొదట తవ్విన ఐదుచోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ ఆరో ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. అవి ఇద్దరు మహిళలవని ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
ఇవి కూడా చదవండి
కర్ణాటకలోని ధర్మస్థల ప్రసిద్ధ శైవక్షేత్రం. దానికి పక్కనే ఉజిరే అనే మరో ఊరు ఉంటుంది. ఈ రెండూళ్ళ చుట్టుపక్కల అటవీప్రాంతంతో పాటు నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంది. అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందంటున్నారు స్థానికులు. ధర్మస్థల పరిసరాల్లో కొందరు మహిళలను దారుణంగా హింసించి, చంపేశారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పదేళ్ల కాలంలో ధర్మస్థల, బెళ్తంగడి, ఉజిరె ఠాణాల పరిధిలో 450 మంది అదృశ్యమయ్యారు. వీటిలో ఒక్క కేసునీ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని హత్యకుగురైంది. 20 ఏళ్ల కిందట మెడిసన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తోందో మహిళ. పోలీసులు తన ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. 2001 నుంచి 2011 మధ్య 452 అసహజ మరణాలు సంభవించాయని ఆర్టీఐకి అధికారికంగా సమాచారమిచ్చారు పోలీసులు. అందులో 96మంది మహిళలే. ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లోనే అన్ని అసహజ మరణాలు జరిగాయంటోంది సమాచారహక్కు చట్ట కింద వివరాలడిగిన నాగరిక సేవా ట్రస్ట్.
ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
ఈ 452 మరణాలు పదేళ్లకాలంలో జరిగినవి. కానీ ధర్మస్థల చుట్టూ దాదాపు ఐదుదశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయి. కొందరు క్రిమినల్స్‌కి ఒంటరి మహిళలే టార్గెట్. జంటగా వచ్చినవారిని కూడా వదలరు. సాక్ష్యాలేమీ దొరకనివ్వరు. డీ గ్యాంగ్‌గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్. కానీ ఎవ్వరూ నోరుమెదపరు. అయినవాళ్లు కనిపించకుండాపోయి.. బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవడమే తప్ప న్యాయం జరగలేదు. కానీ భీమా వాంగ్మూలంతో డొంక కదులుతోంది. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో ఎముకలు చెల్లాచెదురై ఉండొచ్చని భావిస్తున్నారు. తవ్వకాలను మరింత విస్తృతం చేశారు. అసలు అంతమందిని పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు? వారిని పాతిపెట్టే సమయంలో సహకరించినవారు ఎవరు? అదృశ్యమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి.. వీటన్నింటిపైనా సాగుతోంది సిట్ దర్యాప్తు. వెయ్యిగొడ్లను తిన్న రాబందైనా ఏదోరోజు గాలివానకు కొట్టుకుపోతుంది. పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడబోతోంది. మట్టిలో సమాధి అయిపోయిందనుకున్న నిజం ఏదోరోజు బయటికొస్తుంది.
ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.