ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్. ఒక్కసారే పది సెంటీమీటర్ల వర్షపాతం. ఆకాశానికి చిల్లుపెడితే కురిసిన కుండపోత. ఆతర్వాత కనిపించిన దృశ్యమిది. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ కనీ వినీ ఎరిగి ఉండరు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్ కాశీ జిల్లాలో ఉన్న ధరాలీ గ్రామాన్ని…మెరుపు వరద తుడిచిపెట్టేసింది. ఖీర్ గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో ధరాలీని మెరుపు వరద ముంచెత్తింది. కళ్లు మూసి తెరిచేలోపల గ్రామంపై జల ప్రళయం విరుచుకుపడింది. అంతెత్తున ఫ్లాష్ ఫ్లడ్ విరుచుకుపడడంతో గ్రామస్తులు హాహాకారాలు చేశారు. చూస్తుండగానే గ్రామానికి గ్రామం జలసమాధి అయింది.
హర్సిల్ ప్రాంతంలో ఉన్న ప్రాచీన కల్పకేదార్ శివాలయం బురద నీటి ప్రవాహంలో మునిగిపోయింది. కల్ప కేదార్ ఆలయం కేదార్‌నాథ్ ఆలయం తరహాలోనే ఉంటుంది. ఆ ఆలయ శిఖరం కేదార్‌నాథ్ ఆలయ శిఖరం ఒకే రూపంలో కనిపిస్తుంటాయి. ఆ శివాలయ ఆర్కిటెక్చర్ కతూరే శైలిలో ఉంటుంది. కేదార్‌థామ్‌లోని శివాలయం కూడా ఇదే శైలిలో నిర్మించారు. 1945లో జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం బయటపడింది. ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగపై ఖేర్ గంగా బిందువులు వచ్చి పడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఆలయం చుట్టూ అలనాటి శిల్ప కళా సౌందర్యం ఉట్టిపడుతుంటుంది.
హిమాలయాల్లో ఉన్న రహస్య సంపదగా కల్ప కేదార్ ఆలయాన్ని గుర్తించారు. గంగానది మూలస్థానం ఆ ఆలయంలోనే ఉన్నట్లు కొందరు భావిస్తారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. 1935-38 మధ్య సంభవించిన భూప్రళయం వల్ల ఈ ఆలయం మునిగినట్లు చెబుతారు. ఉత్తరకాశీ జిల్లా కేంద్రం నుంచి గంగోత్రికి వెళ్తున్న మార్గంలో నదీ తీరం వద్ద కల్పకేదార్ ఆలయం ఉన్నది.