ఇప్పుడంతా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో 2013లో ధనుష్ హీరోగా నటించిన రాంఝనా సినిమాను ఇటీవల మళ్లీ విడుదల చేశారు మేకర్స్. కాకపోతే అందులో ఒరిజినల్ క్లైమాక్స్ లేదు. ఏఐ సాయంతో రూపొందిన క్లైమాక్స్ జత చేశారు. నిజానికి సినిమా చివర్లో హీరో చనిపోతాడు. కానీ ఏఐ సాయంతో ధనుష్‌ను చంపకుండా బతికించి కథ సుఖాంతం చేశారు.
ఈ క్లైమాక్స్ మార్చడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు హీరో ధనుష్. క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆత్మనే కోల్పోయిందన్నారు. జనాలు ఆ సినిమాను ఎలా ఆస్వాదించారో అలా కాకుండా, మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ధనుష్.
ధనుష్ కామెంట్స్‌పై చిత్ర నిర్మాణ సంస్థ ఇరోస్ ఇంటర్నేషనల్ కూడా స్పందించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో క్లైమాక్స్ మార్పు చేస్తున్నామని తమ ప్రతినిధి ధనుష్ టీమ్‌ని సంప్రదించారని తెలిపింది. అయితే అప్పుడు అభ్యంతరం చెప్పని ధనుష్ ఇప్పుడిలా ఎందుకు మాట్లాడుతున్నారోనని తెలియదని పేర్కొంది.
ఈ వివాదంపై లేటెస్ట్‌గా దర్శకుడు ఆనంద్ రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిణామాలు ప్రమాదకరమన్నారు. తన ఇతర సినిమాల విషయంలోనూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు మార్పులు చేయడం వల్ల సృజనాత్మకతను దెబ్బతీసినట్టు అవుతుందన్నారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.